పుట:Andhravijnanasarvasvamupart2.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుమానము - మన వైయాయికులచే నంగీకరింపబడిన నాలుగు ప్రమాణములలో నిది రెండవది. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అనునవి నాలుగు ప్రమాణములు. ప్రమ యనగా యథార్థానుభవము, నిజమైన జ్నానము. ప్రమకు గారణము ప్రమాణము; అనగా నేసాధనంబుల వలన మనకు యథార్థజ్నానము కలుగునో, వానికి బ్రమాణము పేరు. అనుమాన మనునది సాధనము. అందువలన గలుగు జ్నానము ' అనుమితి ' యందురు.


ధూమ మున్నచోట నెల్ల నగ్ని యుండునా యుండదా యని యెవనికి సంశయము కలదో వానికి ధూమజ్నానముచ్?ఏత నగ్నిజ్నానము కలుగనేరదు. అట్లు సంశయము లేక ధూమాగ్నులకు గల సంబంధము నిశ్చయముగా దెలిసినవానికి ధూమజ్నానముచే నగ్నిజ్నానము తప్పక కలుగును. అందువలన వ్యాప్తి నిశ్చయమే యనుమితికి గారణ మని మనము చెప్పవచ్చును. ఈ వ్యాప్తిజ్నానము సాహచర్యజ్నానముచే గలుగుచున్నది. కావుననే ' నియతసాహచర్యమే వ్యాప్తి ' యని చెప్పబడినది. వంటయింటిలోను, ఇతర స్థలములందును మరల మరల ధూమాగ్నుల సాహచర్యముం జూచుటచేత ధూమము వ్యాప్య మనియు అగ్ని వ్యాపక మనియు జ్నానము కలుగుచున్నది; అనగా వ్యాపకమెప్పుడును వ్యాప్యమునకంటె నెక్కుడు ప్రదేశ మాక్రమించుకొని యుండును. ధూమ మున్నచోట నెల్ల నగ్ని యుండును, కాని అగ్ని యున్నచోట నెల్ల ధూమ ముండదు. అందువలన నగ్ని యున్నప్రదేశము లెక్కువ; ధూమ మున్న ప్రదేశములు తక్కువ. కావున ధూమము వ్యాప్యము, అగ్ని వ్యాపకము. ఇదియే మరియొక విధముగ జెప్పవచ్చును. వ్యాప్తిసహితమైనది వ్యాప్య మనబడును. వ్యాప్తి నిరూపకము వ్యాపక మనబడును. అగ్ని లేనిది ధూమ ముండదు. కాని ధూమము లేనిది అగ్ని యుండును. ఎర్రగా గాలిన యుక్కు కడ్డీయందు నగ్ని కలదు కాని ధూమము లేదు. కావున ధూమము (వ్యాప్యము) నందు, అగ్ని (వ్యాపకము) యొక్క వ్యాప్తియున్నది. కాని అగ్నియందు ధూమము యొక్క వ్యాప్తి లేదు. ఒకప్పుడు వ్యాప్యవ్యాపకములకు సమానవ్యాప్తి యుండవచ్చును. అగ్నికి మారుగా ' పచ్చి కట్టెల యగ్ని ' అనునది వ్యాపక మనుకొందము. అప్పుడు ' పచ్చి కట్టెల యగ్ని ' యున్నచోట నెల్లధూమ ముండుటయు, ధూమమున్నచోట నెల్ల బచ్చికట్టెల నిప్పుండుటయుం దటస్థించినందున, ఈ రెండును ఒకదాని కొకటి వ్యాపకు, వ్యాప్యము అని చెప్పవచ్చును.

అవినాభావ రూపసంబంధము వ్యాప్తి యని మరియొక లక్షణము కలదు. ఏది లేక యేది యుండదో దానికి రెండవదానితో అవినాభావసంబంధ ముండు నని చెప్పెదరు. అగ్ని లేక ధూమ ముండదు. కావున అగ్నియొక్క యవినాభావసంబంధము ధూమమునం దున్నది. అగ్నియందు ధూమముయొక్క యవినాభావసంబంధము లేదు. అగ్నిలేని ధూమ ముండదు గాని ధూమము లేని యగ్ని యుండవచ్చును. ధూమ ముండినగాని యగ్ని యుండ దన్న నియమము లేదు. కావున అగ్ని వ్యాపక మనియు, ధూమము వ్యాప్య మనియు దెలిసికొనవలెను.