పుట:Andhravijnanasarvasvamupart2.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనిపినకట్టె - బళ్లారి జిల్లా, హోస్పేట తాలూకా యందలి గ్రామము. జనసంఖ్య 333 (1931).

అనిమల - కడప జిల్లా, కమలాపురం తాలూకా యందలి గ్రామము. జనసంఖ్య 3,163 (1931).

అనిమిగానిపల్లి - చిత్తూరు జిల్లా, కుప్పం తాలూకా యందలి ఈనాం గ్రామము. జనసంఖ్య 421 (1931).

అనియంకభీమదేవుడు

3. కళింగమును బరిపాలించిన గంగవంశపు రాజులలో నొకడు. రెండవ అనియంకభీముని పౌత్రుడు; మూడవ రాజరాజునకును మంకుణదేవికిని జనియించినవాడు. ఇతడు ముప్పది నాలుగు సంవత్సరములు రాజ్య మేలినట్లు గాంగశాసనములు తెలుపుచున్నవి. వీని సంకవర్షములుగ పరిగణించి మన్మోహన్ చక్రవర్తిగా రీరాజు శకవర్షము 1133 నుండి 1160 వరకు పాలించినట్లు నిర్ణయించిరి. ఈతని తండ్రియగు మూడవ రాజరాజుకాలమున నుండియే కళింగోత్సలములపయి మహమ్మదీయుల దండయాత్ర లారంభమయినవి. ఈతని కాలమున మత్కలముపయి దండెత్తివచ్చినవాడు బంగాళము నేలుచుండిన నాలుగవ సుల్తాను ఘియాజుద్దీన్ ఇవాజ్. ఈ దండయాత్రయందు మహమ్మదీయులు జయించి రనియు, హిందువులు పరాజయము నొంది రనియు మహమ్మదియ చరిత్రకారులు వ్రాసిరి కాని యది విశ్వసనీయముగ గన్పట్టదు. ఏలయన అనంగభీమదేవుని శాసనముల వలన అతని ప్రధాని యయిన విష్ణు వనునతడు యవనుల నోడించినట్లు తెలియుచున్నది. మన పూర్వులు మహమ్మదీయులను యవను లనియు బేర్కొనుచు వచ్చినందున వీరు బంగాళదేశపు మహమ్మదీయు లయి యుందు రని చరిత్రకారులు నిర్ధారణ చేసియున్నారు.

అనియంకభీమదేవు డుత్తరమున మహమ్మదీయులతో బోరాడుచుండిన కాలమున ఓరుగంటి కాకతీయులు కాకతి గణపతిదేవుని నాయకత్వమున దమరాజ్యమును ప్రాక్సముద్రతీరము వరకును విస్తరింపజేసికొనుచుండిన సందర్భమున, వేంగీ మండలమును జయించి, గోదావరి నుత్తరించి, కళింగముపయి దాడి వెడలిరి. కాకతిరాజ్య సమర్థు డని బిరుదందిన రేచర్ల రుద్రరడ్డి సామంతుడు రాజనాయకుడు కళింగ దండయాత్రను నడిపిన శూరాగ్రేసరుడు. కాకతి గణపతిదేవుని శాసనములు సయిత మాతడు కళింగమును జయించినట్లు వాకొనుచున్నది. కాని కేవల మిది తాత్కలిక సైనిక విజయముగనే కాన్పించును; ఏల యన, అనతికాలముననే అనియంకభీముని దండాగ్రేసరవల్లభుడును, ఖడ్గసింహుని అగ్రపుత్రుడును అగు ' శ్రీమజ్జెస్రాజకుడు ' వేంగీ మండలమును జయించినట్లు దాక్షారామ శాసనములు తెలుపుచున్నవి.