పుట:Andhravijnanasarvasvamupart2.pdf/624

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దనక్కరలేదు

అ‌వధానము

నిర్వచనము: ఏదియైన నొక విషయమున అనగా నొకవస్తువునందుగాని భావమునందుగాని మనస్సు లగ్నమైయుండుట అ‌వధాన (Attention) మనబడును. ఇట్లనుటచే మనస్సాకవిషయమున నిలిచియున్న పుడితరసమీపవిషయములు బొత్తిగ గోచరమగుటలేదని యూహింపరాదు. మనసు నిలిచియుండినవిషయములవలె నంత స్పష్టముగ వానిచుట్టు నున్న యితర విషయములు మనస్సునకు గోచరమగుటలేదని యర్థము. ఒక దీపమునొద్ద మన మొక కాగితమును జదువుచున్నపుడు మనమనస్సు దానియందు బ్రవేశించియుండినంత మాత్రమున దీపమును దానిచుట్టునున్న యితర వస్తువులును మన సమీపమున గల వనియైన మనము తెలిసికొనకపోము. కాని మనయవధానశక్తి కాగితమునుగూర్చి యాలోచించుటలో వినియోగపడుచుండుటచే దానిని గూర్చి గ్రహింపగలిగినంతగ నితరవస్తువులను గూర్చి మనము గ్రహింపజాలము. ఇట్లే కాగితము యొక్క వివిధభాగములనుగూర్చి మనమెఱుంగవలయును. మనము చదువుచున్న వాక్యమును గూర్చి తెలియునంతగ నితరవాక్యములునుగూర్చి మనకు దెలియుటలేదు. కాని మనము చదువుచున్న వాక్యము కాక మఱికొన్ని వాక్యములు గూడ నాకాగితముపై వ్రాయబడియున్న వని మాత్రము మనము గ్రహింపగలము. ఇట్లే ఆకాగితమునందలి పదములను గూర్చియు, అక్షరములనుగూర్చియు మనము తెలిసికొనవలయును. మనస్సు తాను ప్రవేశించియుండిన విషయమునం దవధానరూపకమగుసంపూర్ణప్రవేశము గలిగియున్నది. దానిచుట్టుప్రక్కలనున్న యితరవిషయములయందు సామిప్యభేదము ననుసరించి యీ మనప్రవేశము, లేక మనోవ్యాప్తి క్రమముగా క్షీణించుచుబోయిపోయి కడు దూరమునందున్న విషయములయందంతరించుచున్నది.