పుట:Andhravijnanasarvasvamupart2.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దనక్కరలేదు

ఆంధ్రదేశమున సింహాచలము పైనను, పాలకొల్లు ప్రాంతములందును కొంతవరకు పండింపబడుచున్నది.

తెలుగుజిల్లాలలో విస్తారముగ బెంపబడుచున్న ' దేశవాళీ ' రకము ఆకులందు విస్తారము ముండ్లు గలిగి చిన్నకాయల్ను గాచును; కాని మోటయినదియు, బాగుగ గాచునదియు నై యున్నది. ఇది గాక సిలన్, ఢక్కా, సిల్హట్ రకము లాయా ప్రాంతములందు ప్రసిద్ధి వడసియున్నవి. ఇటీవల క్వీన్, కెయన్ని, క్యూ మొదలగు రకము లితర దేశముల నుండి తేబడి అచ్చటచ్చట సాగు చేయబడుతున్నవి. కడపటి రెండు రకములును ఆకులం దంతగా ముండ్లు లేక పెద్దకాయలను గాచును. సింహళమున నొకప్పు డొక క్యూరకపు కాయ 24 పౌనులు తూగెనట. కాని యీ రకములు దేశవాళీ రకములంత మోటయినవి గావు. నాటినచోటనుండి 3, 4 సంవత్సరముల కొకసారి తీసి క్రొత్తచోట నాటుచుండవలెను; లేనిచో క్షీణించును.

అనాస ఉష్ణమండలవాసియయినను కించిన్న్యూనోష్ణదేశము లందు గూడ పైరగును. ఇది సగటు ఉష్ణత ఫారిన్‍హీటు ' 62 లు మొదలు ఫా. 90 ల వరకు గల ప్రదేశములందు జయప్రదముగ సాగు చేయబడుచున్నది. 1000 - 2000 అడుగుల ఉన్నతముగల ప్రదేశములు దీని కనుకూలములు. కాని సముద్రపు మట్టము నుండి 5000 అడుగుల వరకు ఉన్నతముగల ప్రదేశములందు సైతము ఇది పెంపబడుచున్నది. వర్షపాతమున గూడ నిది చాల హెచ్చుతగ్గుల నోర్చును. 25 అం. మొదలు 100 అం. వరకును గురియు ప్రదేశములం దిది పైరగుచున్నది.

అనాసతోటలను నాటుటకు ఆగష్టు, సెప్టెంబరు నెల లనుకూలములు. అప్పటికి కాపు ముగియును గావున నపుడే తోటలలో నవసరములగు పిల్కలను దీసి మరల నాట వీలగును. పిల్కలు ముందు లభించుచో జూన్, జూలై నెలలలో గూడ నాటవచ్చును.

అనస పలువిధములగు నేలలలో పైరగును. నీరు సులభముగ వడియుటయే అనాసకు దగిన నేలల ముఖ్యలక్షణము. కావున నిందుకు ఎసుక గరువులును, గరుములును తరచు ఎన్నబడుచుండును. సేంద్రియపదార్థము హెచ్చుగ నుండుటచే క్రొత్తగ నడవి నరకి సాగునకు దెచ్చిన నేల లీ తోటలకు బ్రశస్తములు. జిగురునేలలో కాయలు పెద్దవిగ ఎదిగినను రుచిమంతములుగ నుండవు. ఏ మాత్రము చౌటికొడి నేలయైనను దీనికి పనికిరాదు.

అనాసతోటలను ఎండలు తీవ్రముగ లేనిచోట్ల ప్రత్యేకముగ నాటుట మంచిది. ఎండలు మిక్కుటముగ నుండుచోట్ల నీ తోటలలో నచ్చటచ్చటను, చుట్టును అరటిమొక్కలను నాటుట మంచిది. సింహాచలమున నీ తోటలలో పనస, మామిడి, జీడిమామిడి మొదలగువాని నాటి, యవి కాచునప్పటికి అనగా 10 సంవత్సరములయిన పిమ్మట అనాసతోటను దీసివేయుదురు. సమప్రదేశములందు గూడ సపోటా, మామిడి మొదలగు తోటలను బెంపదలచు ప్రదేశములలో వానితోపా