పుట:Andhravijnanasarvasvamupart2.pdf/310

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమరావతీ స్తూపము.--- ఈ శీర్షిక దక్షిణాపథము నందలి బౌద్ధకళా, శిల్పములకును, ఆంధ్రదేశమున ప్రాచీనకాలము నందు వ్యాపించిన మతము పరిస్థితులకును సంబంధించిన గొప్ప విషయమును తెలుపును. ప్రధానముగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా అమరావతీ గ్రామమునందలి స్తూపము యొక్క చరిత్రము వలననే ఈ విషయము విశదము కాగలదు.

స్తూపము : - స్తూప మనుపదము సంప్రదాయమును బట్టి బౌద్ధనిర్మాణములకే వర్తించును. దీని ప్రాకృతరూపము ధూపము. ఇప్పటికి నీపదము సింహళమున వ్యవహారమునం దున్నది (చూడుడు: ధూపారామము). ఈపదమే సామాన్యజనవ్యవహారమున తోపు అయినది. అయితే బౌద్ధవాజ్మయమునుబట్టి కాని, అమరావతి మొదలయిన బౌద్ధక్షేత్రములందు గానవచ్చిన శాసనముల ననుసరించి కాని అప్పు డీస్తూప మనుపదము వాడుకయం దుండినట్లు కానరాదు, కాని యిందులకు బదులుగ చైత్య మనుపేరే వ్యవహారమునం దుండెను. ఒక్కచైత్యమే యుండునెడల చైత్య మనియు, పెక్కుచైత్యము లుండునెడల నందు ప్రధాన మయినదానికి మహాచైత్య మనియు పేరుండును. ఇందులకు నిదర్శనముగ నమరావతియం దుండిన ప్రధాన చైత్యమును, ఇటీవల నాగార్జునునికొండయందు త్రవ్వగా బయలుపడిన స్తూపములలో ప్రధాన మయినదియు మహాచైత్య నామాంకితము లయియుండుట గమనింపవచ్చును.

చైత్యము : - చైత్య మన్నపదము 'చితా' శబ్దముననుండి పుట్టినది (చితాయాః ఇదం చైత్యం, అనగా, చితికి సంబంధించినది). ప్రాచీనబౌధులలో బుద్ధునియొక్కయు, ప్రసిద్ధు లయిఅన్ అర్హతుల యొక్కయు ధాతువిశేషములను పూజించుతలంపుతో భద్రపరుచుట ఆచారముగ నుండినట్లు మనకు బౌద్ధవాజ్మయమువలన దెలియుచున్నది. (1) బుద్ధులయొక్కయు, (2) ప్రత్యేకబుద్ధులయొక్కయు, (3) అర్హతులయొక్కయు, (4) చక్రవర్తులయొక్కయు ధాతువులు బైత్యనిర్మాణములందు భద్రపరిచి పూజింపవచ్చు నని యొకప్పుడు బుద్ధుడే తన ప్రధానశిష్యుడయిన ఆనందునితో తెలిపినట్లు ' మహాపరినిబ్బానసుత్తమూ న గలదు. తన మతప్రచారమునకు చక్రవర్తు లెక్కువ యావశ్యక మని గ్రహించి కాబోలు బుద్ధు డీపట్టికయందు వివేకముతో చక్రవర్తులగూడ చేర్చినట్టు కన్పట్టును. ఈపూజ్యత కాశించియో యేమో తరువతి కాలమున అశోకచక్రవర్తి (క్రీ.పూ. ) బౌద్ధధర్మ ప్రచారమునం దసాధారణ కుతూహలమును గనబరిచెను. బుద్ధుని యాదేశమును శిరసావహించి అతడు నిర్మాణము చెందిన వెంటనే అతని ధాతువుల నెనిమిది భాగములు చేసి, యొక్కొక్క