పుట:Andhraveerulupar025958mbp.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుచ్చుకొని బ్రహ్మనాయకునితో విధ్యుక్తధర్మము నెఱవేర్చితినని విజ్ఞాపనము జేసికొనెను. బ్రహ్మనాయడు, ఆతని పత్నియుగొంచెముసేపు దు:ఖించి క్రమముగా విచారము మఱచిరి. కొన్నిసంవత్సరములు జరిగినమీదట పేర్నీడు బాలచంద్రుని తన వెంటగొని బ్రహ్మనాయకుని కప్పగించి సుగుణరత్నాకరుడగు కుమారుని జంపుదురా? కన్నమనాయనిదయచే నీశిశువు బ్రదికినాడు. లేకున్న మనవంశము నశింపవలసినదే గదాయని నిష్ఠురములాడెను. ఐతాంబయు బ్రహ్మనాయడును దనకుమారుడు మఱల వచ్చినందులకు బ్రహ్మానందము నొంది యింతటియదృష్టము కలుగజేసిన కన్నమ నేడు ప్రశంసాపాత్రుడని యాతని వేయినోళ్ళ గొనియాడిరి. నాడు మొదలు కన్నమనీడు బాలచంద్రునిపై దన పంచ ప్రాణములుంచి యతనిశ్రేయస్సే తనదిగా భావించి తానెఱింగిన విద్యలన్నియు నాతనికి నేర్పుచు వెంటనిడుకొని త్రిప్పుకొనుచుండెను. బాలుని విద్యావివేకములకు గన్నమనేని సోదరప్రేమకు బ్రజలందరు. సంతసించిరి.

కొంతకాలము గడచినమీదట నాయకురాలు మాచెర్ల వైభవము చారులవలన నాలించి యెటులేని బ్రహ్మనాయకుని, రాజకుటుంబమును బరాభవింప దలంచి పలువురు దొంగలను బిలువనంపి వారి నందఱను మాచర్లలోని రాజమందిరము, బ్రహ్మనాయకుని గృహము దోచిరండని పంపెను.