పుట:Andhraveerulupar025958mbp.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనన తిధి నక్షత్రత్రాదులను దెలిపి జాతకము వ్రాయుడని కోరెను. నాయకురాలివంపున వచ్చిన వంచకబ్రాహ్మణుడు తన విద్యాప్రకటనము గావించి బ్రహ్మనాయుని లోగొని జాతకమువ్రాయుదునని చెప్పి సెలవొంది కొన్నిదినములకు సభచేయించి అందుజాతకపత్రికను బఠించెను. 'బాలచంద్రుడు మిగుల దుర్మార్గుడగును. వాని జన్మనక్షత్రము చెడ్డదగుటచే దనవారికి బెరవారికిగూడ నిత డకాలమృత్యువై సర్వకుటుంబములు రూపు మాపగలడు. బాలకునివలని యపాయము తొలగింపవలయుననిన దెగటార్చుట తప్ప వేఱుకర్తవ్యములే'దని కపటజ్యోతిష్కుడు చెప్పెను. సభ్యులు, రాజబంధువు లొకరి మొగము లొకరు చూచుకొని బ్రహ్మనాయకుని కేమియు జెప్పజాలక మిన్నకుండిరి. ఇదియంతయు బ్రహ్మనాయడు కనిపెట్టి పుత్రప్రేమను దిగనాడి సభ్యులందఱి నడిగి యనుమతి దెలిసికొని బాలునిజంపుటకే నిశ్చయించుకొనెను. అంతలో నొక వృద్ధుడు లేచి 'బ్రహ్మనాయకా! బాలునిజేతిమీద జంపుటయన్న సామాన్యకార్యమా? ఎవరికి జేయాడును? సముద్రమున బాఱవేసిన వాడె చచ్చును. అదియె కర్తవ్య'మని తెలిపెను. బ్రహ్మనాయడు పెచ్చుపెరుగుశోకము నాపుకొని తన యభిమానపుత్రుడగు కన్నమనాయకుని బిలువనంపించి ఐతమ్మకడ జనుబాలుద్రావుచున్న యేపాపము నెఱుంగని బాలచంద్రుని దెప్పించి యీబాలకుని సముద్రములో బడవేసి