పుట:Andhraveerulupar025958mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆకాలమున రుద్రదేవుని నెదిరించిన రాజులలో బలువురు ప్రసిద్ధులు గలరుగాని వారి ప్రత్యేక చరిత్రములు సమగ్రముగా దెలియ వచ్చుటలేదు. దొమ్మరాజు బలవంతులలో నగ్రగణ్యుడు. ఈతడు అనుమకొండరాజ్యమును హరింప వలయునని సమధికబల సమేతుడయివచ్చి కోటముట్టడించెను. ఈముట్టడి కొన్నిమాసములు జరిగెను. కాకతీయ సైన్యములు దొమ్మరాజు సైన్యముల జించిచెండాడెను. విజయముపై నాసమాని బ్రతుకుజీవుడాయని దొమ్మరాజు గుఱ్ఱమునెక్కి పారిపోవుచుండగా రుద్రదేవుడు వెంబడించి బాణముల బ్రయోగించి యాతనికాయము గాయము గావించెను. దొమ్మరాజు తన యశ్వారోహణనైపుణ్యము ప్రాణరక్షణముకొఱ కుపయోగించి యెందో దాగెను. రుద్రదేవుడీ యదనుగ్రహించి పరివారసహితముగా దొమ్మరాజు రాజ్యమునందు బ్రవేశించి కోట బగులగొట్టి రాజధాని గొల్లగొని విజయస్తంభమును బ్రాతించి తనప్రతినిధి నారాజ్యము నందుంచి వెనుకకు మరలెను. రుద్రదేవుడు దొమ్మరాజుతో బోరుచున్న సమయము తమ కనుకూలముగా గ్రహించి మేడరాజు, మేళగిదేవుడు అనుమకొండపైకి దాడివెడలిరి. అనుమకొండయందున్న మూలబల మావీరయుగముతో బోరాడుసరికి రుద్రదేవుడు రాజధానిజేరి వ్యూహముల బన్ని విరోధిబలములను బంచబంగాళము గావించెను. మేడరాజు,