పుట:Andhraveerulupar025958mbp.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాదేవరాయలు విజయయాత్రలకు బుణ్యక్షేత్రములకు రుద్రదేవు డేగినపుడెల్ల రాజ్యవ్యవహారములు నిర్వహించుచు రాజద్రోహులతో గలిసి రుద్రదేవుని గడముట్టించు నుపాయము లారయుచు సమయమునకై నిరీక్షించియుండెను. ఇది గ్రహించి రుద్రదేవుని విరోధులగు సామంతరాజులు ఆంధ్రసామ్రాజ్యమును హరింపనెంచి మహాదేవరాయలతో రాయభారములు జరిపి విప్లవోద్యమమున బాల్గొన వాగ్దానము గావించిరి. రుద్రదేవు డిదియంతయు గ్రహించి తనతండ్రి యవసానకాలమున గావించిన హితోపదేశము జ్ఞాపకముంచుకొని సోదరుని క్షమించెను. ప్రతిపక్షులుమాత్రము మహాదేవరాయలు తమపక్షమువాడుగ విశ్వసించి యుంటచే నియతకాలమున అనుమకొండ రాజ్యమును ముట్టడింప బయలుదేరివచ్చిరి. ఈవిపరీత పరిస్థితులన్నియు రుద్రదేవుడు సమగ్రముగా గ్రహించి విరోధులతో సోదరుడు కలియకుండునటుల వలయు గట్టుదిట్టములు తొలుతగావించి ప్రత్యర్థుల మట్టుపెట్టుటకు సైనికబలమును మిగుల వృద్ధిజేసి విరోధు లరుదెంచు మార్గముల దెలిసికొని త్రోవలనరికట్టి వధింప గొంతబలమును బంపెను. మహాదేవరాయల యొద్దనుండి తమకు సరియగు నుత్తర ప్రత్యుత్తరములు నడుపకున్నను, దురాగతులగు ప్రత్యర్థిరాజులు అనుమకొండరాజ్యము హరింప సకాలమునకు వచ్చి రుద్రదేవుని ధాటి కాగజాలక ప్రాణమానముల గోల్పోయిరి.