వేడుకొనెను. విజయాదిత్యుని, నాతని ధర్మపత్నిని స్వయముగా నెరింగినవాడుకాన విష్ణువర్ధనుడు గతమునకు జింతించి రాజపత్నిని నోదార్చి పుత్రికాభావముతో బ్రేమింతునని వాగ్దానము గావించి రాజపత్నిని దనయింట నుంచికొని వేయికనులతో గాపాడుచుండెను.
విష్ణువర్ధన భట్టారకుడు సమయోచితములగు పురాణ కథాదికముచే భర్తృచింతయంతయు రాజపత్నికి మఱపునకు వచ్చునటులజేసి వీరమాతవు గమ్మని యాశీర్వదించెను. నవమాసములు నిండినపిమ్మట నొక శుభ ముహూర్తమున రాజపత్ని తేజోవంతుడును, రూపవంతుడునునగు నొక కుమారుని గనెను. విష్ణువర్ధన భట్టారకు డాబాలుని జననకాలమును బట్టి జాతకమువ్రాసి యీబాలుడు పూర్ణాయుర్దాయ సముపేతుడై యాంధ్రదేశము నంతయు బరిపాలించురాజు కాగలడని తెలిసికొని మిగుల వైభవముగా జాతకర్మాదికిములు ముగించెను. రాజపత్ని, విష్ణువర్ధనభట్టారకుడు తన కొనరించిన మేలునకు, దనవంశమునిలిపి కావించిన మహోపకారమునకు బ్రతిఫలముగ దనకుమారునకు విష్ణువర్ధనుడని నామకరణము గావించెను. కొడుకులు లేరను విచారముమాని విష్ణువర్ధన భట్టారకు డాబాలుని దన కుమారునివలెనే గారాబముతో బెంచి పెద్దవానినిజేసి బాల్యముననె పురాణవీరుల విక్రమములు బోధించి వేదము, శాస్త్రము, ధనుర్విద్య నేర్పిం