పుట:Andhraveerulupar025958mbp.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నితో నెలలతరబడి పోరాడి యాతని మడియించెను. సైనికులందఱు రాజుపడుటజూచి చెల్లాచెదరైపోయిరి. విజయాదిత్యుని పట్టపుభార్య యా సమయమున గర్భవతిగానుండెను. స్వార్థపరాయణులగు సైనికులు భటులు తమత్రోవను దామేగుటచే రాణి దిక్కుమాలినదై విరోధిరాజులచే బట్టుపడిన నాపద కలుగునేమోయని చాల విచారపడెను. గర్భవతిగానుంటచే జాళుక్యవంశాంకురమును దగ్ధముచేసి సహగమనము గావించుట కంగీకరింపకపోయెను. త్రిలోచనపల్లవుని ధాటికి వెఱచి రాజ మహిషి కెవరును తావొసంగరైరి. విశ్వాసపాత్రురాండ్రగు పరిచారికలు, పురోహితుడు జాగరూకతగా రాజపత్నిని గాపాడి శిబిరమునుండి యర్ధరాత్రమున నామెను వెంటనిడికొని మహారణ్యమునకు జేరి కొన్నిదినములకు ముదివేము అను నగ్రహారమునకు జేర్చిరి. అగ్రహారాధిపతి పేరు విష్ణువర్ధనభట్టారకుడు. సమస్తశాస్త్ర పారంగతుడు. అతిధిపూజా పరాయణుడగు నీ బ్రాహ్మణుడు తన యగ్రహారమునకు వచ్చిన నూతనుల నందఱను గృహమునకు రావించి యాతిధ్యమొసంగి సత్కరించెను. చాళుక్యపురోహితుడగు బ్రాహ్మణుడు విష్ణువర్ధన భట్టారకునితో నేకాంతమున జాళుక్యవంశమునకు గలిగిన విప్లవము, విజయాదిత్యుని యకాలమరణము నివేదించి రాజపత్ని నాయనపాదములపై బడవేసి చాళుక్య వంశాంకురమును గర్భమున ధరించిన యీసాధ్విని గాపాడమని