పుట:Andhraveerulupar025958mbp.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొక కలకలము వినవచ్చెను. మఱికొంతదూర మటులె సాహసముతో జనుదేర వీరుల సింహ నాదములు, గజబృందముల ఘీంకారములు, తురంగముల హేషలు, కాహళ మృదంగభేరీ గోముఖాది వీరాంగనినాదములు ప్రళయకాల కాలాంభోధర గర్జాసన్నిభంబులై వినబడెను. అంతలో దెల్లవారెను. దట్టముగ గందరమందిరమున బెనగొన్న చీకటులు పలుచబడెను. బాలభానుని రక్తకిరణములు కంద రాంతరమున వసంతము జల్లుచుండెను. మాధవవర్మ యా యమకాల విభవమును జూచి యానందించుచు మిగుల నుత్సాహముతో నింక గొంత దూరము నిర్గమించెను.

ఒక విశాలమగు స్థలమున నఱువదివేల మదగజములు, పండ్రెండులక్షల తురంగములు, పదునేడు లక్షల పదాతి వర్గము మూకగ నుండెను. సేనానాయకుడు దివ్యాంబరంబులతో సువర్ణరాసులతో నిండిన యొక గుహద్వారమున శిలపై నాసీనుడై యుండెను. మాధవవర్మ యటకు బ్రవేశించెను. వెంటనే కరములు ముకుళించి పదాతులందఱు మాధవవర్మ కంకితులైరి. సేనానాయకుడు నమస్కరించి మాధవవర్మను సమీపించి "రాజకుమారా! పద్మాక్షీదేవీ యనుగ్రహమునకై కలకాలమునుండి యిట వేచియున్నారము. మానోములు ఫలించినవి. ఆయమ యాజ్ఞ యిచ్చిన మాధవవర్మ నీవే కానోపు. ఈ బలమునంతయు