పుట:Andhraveerulupar025958mbp.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హస్తములతో సిరియాలదేవి కుపచారములు గావించుచుండిరి. గ్రహములన్నియు శుభస్థానములయందున్న యొకానొక పవిత్రసమయమున సిరియాలదేవి కొక మగచిన్నవాడు జనించెను. మాధవశర్మ మిగుల బ్రేమతో జాతకకృత్యములన్నియు నిర్వర్తింపజేసి యొక సుముహూర్తమున నామకరణ మహోత్సవము గావింప సంకల్పించెను. సిరియాలదేవి మాధవశర్మను సందర్శించి వందనమాచరించి, "ఆర్యా! మీరు నాకు బితృసములు. నేను సుతవతినై భర్తృసందేశమును బరిపాలింప గలుగుట మీ యాశ్వీరచన ప్రభావముననే, దైవమైనను దేశికుడైనను మీరేకావున నాతనయునకు మీ పవిత్ర నామము గలసివచ్చినటుల మాధవవర్మ యని నామకరణము గావింతురేని నామస్మరణముచేతనైన గృతజ్ఞత వెల్లడించు కొందునని సవినయముగ విన్నవించెను. మాధవశర్మ యెట్టకేల కంగీకరించి యుత్తమోత్తములగు బ్రాహ్మణుల రావించి యాకుమారునకు జాతకర్మలన్నియు విధిచోదితముగ నిర్వర్తించి మాధవవర్మయని నామకరణము గావించి యందఱచే నమోఘాశీర్వాదములం జేయించెను. శుక్లపక్ష క్షపాకరుని మాడ్కి యాకుమారుడు దినదినప్రవర్థనమానుడై యుంట గాంచి పుత్ర పుత్రికాశూన్యుడగు నా బ్రాహ్మణోత్తముడు మిగుల గౌరవముతో జూచుచుండెను. దైవానుగ్రహమువలన మాధవశర్మ యమోఘాశీర్వాద ప్రభావమున గుమారుడు వర్ధిల్లసాగెను.