పుట:Andhraveerulupar025958mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణుల వాక్యముల భటుల వాక్యముల నాలించి నిశ్చయము తేల్చుకొనజాలక భూసురులం గాంచి 'యీయమను బ్రాహ్మణి యనుచుంటిరిగదా! సమీపముననున్న సిద్ధేశ్వరుని సమ్ముఖమున నీయమ పెట్టునాహారమును భుజించెద రేని మీమాట విశ్వసింతు' ననెను. యుక్తిశాలియగు మాధవశర్మ బల్లహునితో 'రాజన్యా! అది యొక గొప్ప పరీక్ష కాదు. సర్వసిద్ధముగ నున్నారము. కాని యీయమ గర్భవతి. గర్భవతి యొసంగు పక్వపదార్థముల బుచ్చుకొనుట బ్రాహ్మణ ధర్మములకు విరుద్ధము. మతమునకు వ్యతిరేకముగ నడువ వలయునని కూడ మీయభిమతము గాదు గాన యుపాయాంతరము నెఱిగింతు రేని యటులె యొనరింతు' మని విన్నవించెను. శాస్త్ర బద్ధముగనున్న మాధవశర్మమాటలకు బ్రత్యుత్తరము జెప్పజాలక బల్లహుడు కొంచెముసేపు యోచించి యీమె యొసంగు నుచ్చిష్ఠమగు క్షీరమును సిద్ధేశ్వరాలయమున బుచ్చుకొందురేని బ్రాహ్మణిగా భావించి వదలుట కెట్టి యభ్యంతరము లే' దని తెల్పెను. బ్రాహ్మణులు మిగుల సంతోషించి యనాచార జన్మమగు కిల్బిషమును దమ తపోమహిమచే బోగొట్టు కొనవచ్చునని నిశ్చయించి యందుల కియ్య కొనిరి. బల్లహుడు చూడకుండ సిరియాలదేవి శిరోవకుంఠనముచే ముఖము నాచ్ఛాదించికొని పదార్థమును బ్రాహ్మణ జనమునకు వడ్డించెను. వారలందఱు నిరాటంకముగ నమృత