పుట:Andhraveerulupar025958mbp.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

న్యాయము వలదా?" యని కఠినముగ మందలించెను. నివ్వెఱపోయి చూచు చున్న బ్రాహ్మణాంగన అందఱు బ్రాహ్మణ హింసవలన మీరాజకుటుంబము రూపుమాయ గలదని శపింప సాగిరి. భటులు చెంతగల ప్రతిచ్ఛందముతో సిరియాలదేవి యాకృతిని నొకమాఱు పోల్చిచూచి మాఱు మాటాడక యాయమను లాగికొని పోవుచుండిరి. ఆగర్భశ్రీమంతురాలు, ఆసన్నప్రసవ-సుకుమారీ మణి, యగు సిరియాలదేవి దుస్థ్సితికి బిల్లలు గలవాడును దయాశాలియు నగు మాధవశర్మ మిగుల విచారము నొంది బల్లహుని కంత్య కాలమునకె యిట్టిబుద్ధులు పుట్టుచున్న వనుచు జూచు చున్న బ్రాహ్మణ బ్రాహ్మణీ జనమును వెంటగొని యూరిబయట విడిసియున్న బల్లహునిపాలికి బోయెను.

దూరమునుండి బ్రాహ్మణ బృందము సంభ్రమముతో వచ్చువిధము గాంచి బల్లహుడు లేచి పూర్వాచారానుగుణముగ వారి కెదురేగి నమస్కరించెను. మాధవశర్మ యావందనము పరిగ్రహింపక కోపరక్తాక్షుడై 'బల్లహ రాజన్యా నీ యధర్మములు కడుపు లోని చల్ల కదలకుండ ఎఱుకరాజు ధర్మ పరిపాలనములోనున్న హనుమకొండ పౌరుల పని గూడ బ్రవర్తింప జేయ వలయునా! ఇంద్రుడు లీలావతిని లాగికొని వచ్చునటుల నేపాపము నెఱుంగని నా యేకపుత్రికను దుర్మార్గులగు నీభటులు లాగికొని వచ్చు చున్నారు.