పుట:Andhraveerulupar025958mbp.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యంత:పురము నంతయు గాలించెను. ఆతనికి నిజవర్తమానము తెలియదయ్యెను. రాణివాసమునందున్న పరిచారికలు ఘోరమగు మరణమునకు నియ్యకొనిరిగాని రాజ్ఞి యుదంతము బహిర్గతము గావింపజాలరైరి. కడకు భ్రాణభయము వలననో దురాశవలననో సిరియాలదేవి హనుమకొండ కేగినదని కొందఱు పౌరులు నివేదించిరి. విజయకేతనము స్థాపించి కొందఱు సైనికుల గందార రాజ్యముననుంచి రాజ్యము జాగరూకతతో సంరంక్షింప నియోగించి, తాను సపరివారముగ సిరియాలదేవి కొఱకై యన్వేషించుచు హనుమకొండకు జేరి పురసమీపమున విడిసి యెఱుకురాజునకు 'మీపురంబున సిరియాలదేవి యున్నటుల రూఢిగా దెలిసినది ఒసంగుదువా! లేక సంగ్రామమునకు వత్తువా!' యని తన భటులచే బల్లహుడు వార్త పంపించెను. భయకంపితుడై యెఱుకరాజు మిగుల జంచిలించి సిరియాలదేవిని నేనెఱుంగననియు రాజధాని నగరమున నెటనైన నున్న మీపరిచారకులచే వెదకించి బంధించుచో నా యభ్యంతర మేమాత్రము లేదనియు నేనట్టి ద్రోహకార్యముగావించి యేలిక యాగ్రహమునకు బాత్రుడగాననియు బల్లహునకు వెంటనే వార్తపంపెను.

ఎఱుకరాజు నిర్దోషియనియు సిరియాలదేవికి దనకై తా నాశ్రయము నొసంగి యుండడనియు బల్లహుడు నిశ్చయించెను. అంత:పురములో నుండి సంగ్రహించి తెచ్చిన