పుట:Andhraveerulupar025958mbp.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మిచ్చెదనని పలుకగా హనుమప్ప నాయకుడను వీరుడు నేను కొనితెచ్చెదనని యంగీకరించి మహమ్మదీయసైన్యముచెంతకు బోయెను. సేనానివేశమునకు మధ్యనున్న విశాలమగు పాకలో గుఱ్ఱములుండెను. అందే, సోమనాద్రిగుఱ్ఱముగూడ నుండియుండునని చొప్పవిక్రయించువానివలె నాత డశ్వశాలజేరెను. మహమ్మదీయు లతనిని జొప్పవిక్రయించు వానిగానే భావించి యుపేక్షించిరి. ఆతడు మెల్లగా బ్రొద్దు క్రుంకువఱకు గడ్డియమ్మువానివలె బేరముచేయుచు వారితో భాషించుచు నుండి రాత్రికాగానే గుఱ్ఱముముందున్న గడ్డిలో దేహముదాచి పరుండెను. అంతలో నొకయవనుడు గుఱ్ఱమును వేఱొకస్థలమున గట్టివేయుటకు మేకు బ్రాతు చుండగా నందు హనుమప్పనాయకునిచేయి దిగబడెను. కదలినచో మహమ్మదీయుడు గ్రహించునని జనమునిద్రచే మాటుమడుగు వఱ కటులనేయుండి చేయి రాకపోవుటచే మణిబంధమువఱకు ఖండించి గుఱ్ఱమునెక్కి శిబిరాభిముఖుడై బయలుదేరెను. సైనికులు నిద్దురలో దలలెత్తిచూచి తమ యశ్వపాలకులె నీరుబెట్టుటకు గుఱ్ఱములను గొనిపోవుచున్నటుల దలంచి మిన్నకుండిరి. తెల్లవారుసరికి హనుమప్పనాయకుడు సోమనాద్రిచెంత గుఱ్ఱమును గట్టివేయించి తానొందిన కష్టములు తెలిపి మొండిచేయిని దార్కాణముగా జూపెను. సోమనాద్రి హనుమప్పనాయకుని సాహస ధైర్యస్థైర్యముల కెంతయు నానం