పుట:Andhraveerulupar025958mbp.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రోసులు దూరమునందున్న నిడుదూరువరకు సేనలు నిండి పోయెను. సోమనాద్రి భటులను పనివాండ్రను నియోజించి శత్రువుల కబిముఖముగా నొక మట్టికోట గట్టించెను. సోమనాద్రి శుభముహూర్తమున అపరిమిత బలసమేతుడై తాను గట్టించినకోటచెంత దండువిడిసి సంగరమున కాయితమయ్యెను. ఉభయ సైన్యములకు భయంకర సంగరము జరుగుచుండెను.

సోమనాద్రిసహాధ్యాయులగు కురుమన్న, ధర్మన్న యోధవేషములు ధరించి కొంతసైన్యమును దీసికొని యవన సైనికుల నెదిరించిరి. కొంతబలమును వెంటగొని సోమనాద్రి స్వయముగా దాను నవాబులపైకి బయలుదేరెను. ఆనాడు జరిగిన జనమారణమునకు మితములేదు. మతావేశ పరవశులగు యవనులు నిలుకడగా బోరి హిందూభటుల నెందఱనో మడియించిరి. ఆంధ్రనాయకులు వ్రేటున కొకయవనుని బడగొట్టి యుద్ధరంగ మంతయు రక్తప్రవాహములతో నించివేసిరి. సోమనాద్రి సామాన్యదళములను విడిచి నవాబులపైకిబోయి ఘోరముగా బోరి ప్రాగుటూరి నవాబగు ఇదురు సాహెబును నఱకివేసెను. బల్లారి బహద్దరుఖానుని జంపెను. ఆదోని నవాబు నంతమొందించెను. ఈ పరిస్థితులు గమనించి సోమనాద్రిధాటి కాగజాలక నిజాముఆలీ హతశేషసైన్యముతో కర్నూలుకోటకు బోయి తలదాచుకొనెను. సోమనాద్రి కర్నూలువఱకు శత్రుసైన్యమును దరిమి ప్రొద్దుగ్రుంకువఱకు దనస్కంథావారము జేరెను.