పుట:Andhraveerulupar025958mbp.pdf/173

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నిజాముఆలీ ముందు సోమనాద్రిపయికి దండయాత్ర కేగుటకు ధైర్యముచాలక తన మిత్రుడును గర్ణాట దేశీయుడును నగు ఇరుపనగౌడు అను నొక వీరుని బిలువనంపి జరిగిన కథాంశమునంతయు నెఱింగించి సోమనాద్రిని వంచించుటకు కుపాయమున్నచో దెలుపుమని కోరెను. ఇరుపనగౌడు ఉభయపక్షముల బలాబలముల నెఱింగిన వాడుగాన చాలసేపు యోజించి 'హర్పనహల్లిలో నాఱుగురు క్షత్రియ కుమారులు దుర్గమమైన కోటగట్టుకొని రాజ్యము పాలించుచున్నారు. వారికి సోమనాద్రికి మిత్రభేదము కలుగజేసితిమేని సోమనాద్రి మడియగలడు. అపుడు గద్వాలకోటను సులభముగా లోగొనవచ్చు'నని సమాధానముచెప్పెను. నవాబు మిగుల సంతసించి యెటులనేని యాకార్యము నీవె సమర్థించుమని భారమంతయు ఇరుపనగౌడుపైన బెట్టి యాసబెట్టెను. ఇరుపనగౌడు తన గ్రామమగు కురిచేడునకు జేరి హర్పనహల్లిలోని క్షత్రియసోదరులు వ్రాసినటు లొక జాబువ్రాసి దూతలచే సోమనాద్రికి బంపెను. సోమనాద్రి యా జాబు చూడగా నందిటుల వ్రాయబడి యుండెను. "సోమనాద్రికి - నీవు సయ్యదు దావుదు మియ్యాను జయించినమాత్రమున లోకైకవీరుడవు కావు. నిజమైన మగవాడవేని మావంటి వీరులను గెలువుము. లేదా మూలబడి యాడుదానివలె బ్రదుకుము." ఈజాబు పఠింపగనే సోమనాద్రికి గోప మతి