పుట:Andhraveerulupar025958mbp.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమనాద్రి రెడ్డి

నిజాము రాష్ట్రములోని మహబూబునగరు మండలమున అమరవాది యను నగరముగలదు. ఆనగరముచెంత గల అచ్చమ్మపేట, రఘుపతిపేట యను గ్రామములను బాకనాటి రెడ్డిశాఖకు జేరిన తిమ్మారెడ్డి యను వీరుడు పాలించుచుండెను. ఈయనభార్య వీరవతంసుండని పేరొందిన మెదకు మండలపాలకు డగు సదాశివరెడ్డి తోబుట్టువు కేశవమ్మ. ఈదంపతులు పశుసమృద్ధియు, ధనసమృద్ధియు గలవారై సుఖముగా నుండ క్షామదేవత దేశమును బీల్చి పిప్పిచేయుచుండెను. పంటలు తగ్గిపోయెను. పశువులుమేతలేక మాడిచచ్చు చుండెను. ప్రజ లన్నమోరామచంద్రాయని యేడ్చుచుండిరి. చేరెడు గంజినీళ్ళకు జనులు మోమువాచి నశించుచుండిరి. తిమ్మారెడ్డిచెంత పుట్లకొలది ధాన్యము గలదు. కావలసినంత ధనముగలదు. ప్రజల ఘోషచూచి సహింపజాలక పాతరలుదీయించి తనయొద్దగల ధాన్యముదంపించి వచ్చినవారందఱికి నెలలకొలది అన్నము పెట్టించెను. ఎంతకును గఱవు తగ్గదయ్యెను. గరిసెలు పాతరలుకూడ రిత్తవయ్యెను. ప్రజలాకలిగొని చచ్చుచుంట జూచి తనభార్య వస్తువులను మంగళసూత్రము దక్క మిగిలిన వన్నియు నమ్మెను. అప్పటికిని బ్రజలబాధ తగ్గదయ్యెను. ఇక నిటనున్న లాభము లేదని