పుట:Andhraveerulupar025958mbp.pdf/164

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సామ్రాజ్య మనదగి ఆంధ్రకవులకు ఆంధ్రులకు నభిమాన స్థలమయ్యెను. నరసింహరాయలు ధర్మపరిపాలనము చేయుతఱి నాతని పరిపాలనమునందున్న రాజ్యమునకు బరదేశీయులు నరసింగరాజ్యమని పేరిడిరి. ఈయన పరిపాలన కాలమున దురకలు శ్రీరంగము నాక్రమించుకొని వసతులన్నియు నూడలాగుకొనుటచే బ్రాహ్మణులందఱు లేచిపోయిరి. నరసింహరాజు తురకల బోదోలి నగరమును స్వాధీన పరచుకొని పూర్వవృత్తుల నన్నింటిని దిరుగనొసంగి శ్రీరంగస్థాపనాచార్య బిరుదము వహించెను. ఈయనచరిత్ర మంతయు సాళ్వభ్యుదయమను సంస్కృత కావ్యమునందు విపులముగా వర్ణింపబడియున్నది. ఈయనకుగల చితప్రబంధపరమేశ్వరుడు, అభినవనాటక భవభూతి, అష్టభాషా పరమేశ్వరుడు, రసికకవితా సామ్రాజ్య లక్ష్మీపతి మున్నగు బిరుదముల వలన గవియు రసికుడు గూడ నీనృపాలుడై యుండునని తెల్లమగుచున్నది. అదృష్టజాతకుడగు నీనృపుడు విద్యానగర సామ్రాజ్యోద్ధారకుడును, ఆంధ్రుడును గావున మనకెంతయు గణ్యుడు.

_________