పుట:Andhraveerulupar025958mbp.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిపాలించిన తిమ్మరుసుమంత్రికి మాతామహుడు. గొప్ప రాజకీయవేత్త యనియు మహాశూరు డనియు బేరొందెను.

నరసింహరాజు తన యంత్యకాలమున విశ్వాసపాత్రుడగు సేనానియు, విద్యానగరమును బట్టుకొనుటలో నెక్కువ సహాయపడినవాడును, తన అన్న మనుమడును నగు తుళువనరసరాజును బిలువనంపెను. ఆయనతో నిటుల జెప్పెను: "మిత్రమా! నా కంత్యకాలము సమీపించినది. నాకుమారు లిరువురు పసివాండ్రు. భాండారము, రాజ్యము నీచేతిలో నుంచుకొని పాలకుడవుగానుండి యుక్తవయస్సు వచ్చినపిమ్మట రాజ్యము నాకుమారుల కొసంగుము. ఈకార్యము నొనరించి సామ్రాజ్యము నుద్ధరించుటకు నీవుదక్క వేఱొకడు లేడు." నరసరాజు అంగీకరింపగనే నరసింహరా జతనికి బట్టాభిషేకము చేసి గతించెను. విశ్వాసవంతుడగు నరసరాజు చిరకాలము రాజప్రతినిధిగనే యుండి పరిపాలించెను. నరసరాజు అంతకుమున్ను కుంతలదేశంబు నందును చోళమండలము నందును శ్రీరంగము నందును ఘోరసంగరము లొనరించి విజయము నొందిన పరాక్రమశాలి గావున బౌరు లీతనిపరిపాలనమున కనుకూలురై యుండిరి. ఆంధ్రభాషాభిమానియై యీ నరపాలతిలకుడు నంది మల్లయ్య, ఘంట సింగయ్య అను జంటకవులచే వరాహపురాణమును రచింపజేసి అంకితమునొందెను.