పుట:Andhraveerulupar025958mbp.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అగ్రజునకు సహాయముగ దేవరకొండదుర్గము పరిపాలించు మాదానాయని చరిత్రము పఠించుటయు మనకు బ్రకృతముకాదు. మాధవనాయకుడు పరిపాలించు దేవరకొండ దుర్గము సామాన్యమైనది కాదు. రాచకొండ దుర్గమును మించినదనియె చెప్పవచ్చును. దేవరకొండ దుర్గమున 360 బురుజులు 9 రాజద్వారములు 32 దొడ్డిత్రోవలు కలవు. దుర్గమున గొన్ని దేవాలయములు 32 పెద్దబావులు కలవు. అనపోతనాయని పరిపాలన కాలములో నీదుర్గమును జూపల్లివారు, వేనేపల్లివారు, కటికినేనివారు, మునుగోటివారు, గుమ్మడపువారు, క్రొత్తవారు, మిర్యాలవారు, పానగంటివారు, గుగ్గిలపువా రనుతొమ్మిదిమంది వెలమనాయకులు సైన్యాధ్యక్షులై సంగ్రామధర్మముల నిర్వహించుచుండిరి. మాధవనాయకుడు మిగులత్యాగశీలుడై విక్రమశాలియై యనేక ధర్మములు గావించి ప్రతిసంగ్రామమున నగ్రజునకు సాయపడి కృతకృత్యు డయ్యెను.

మాధానాయకుడు శ్రీశైలమున సోపానములు గోపురమండప ప్రాకారములు గట్టించిన శ్రీశైలోత్తర ద్వారమున నొకమండపము నిర్మించెను. ఇతడు సర్వవిధముల ననపోతరాజునకు సమానుడనుట కీపద్య మాధారము కాగలదు.