"శ్లో|| ముని రజనిపరశురామ:
స్థానే వినియుజ్య వైష్ణవం తేజ:
సోమకులపరశురామే
దరామవ త్యన్న పోతభూపాలే||"
(తా|| పరశురాముడు తన విష్ణుసంబంధమగు తేజము నంతయు సోమకుల పరశురాముడగు ననపోతభూపాలకుని స్థానమునం దుంచెను.)
అనపోతనాయకు డాంధ్రదేశమునంతయు వశము గావించుకొని రాచకొండ రాజధానిగ నొనరించుకొని శత్రు జనభీకరముగా రాజ్యము చిరకాలమేలెను. ఈరాచకొండ నిజామురాష్ట్రములో నల్లగొండమండలమున నున్నది. ఇది హైదరాబాదునకు దూర్పుగా 34 మైళ్ళదూరమున గలదు. అనపోతనాయని రాజ్యవిస్తృతి బలసామర్థ్యములు గ్రహింప నుద్దేశింతుమేని యీదుర్గచరిత్రము తెలిసికొనుట యావశ్యకము. గ్రామముచుట్టు మిగుల దృడతరమైన కోటయు మిగుల లోతుగల యగడ్తయు గలవు. దుర్గమునకు నాలుగువైపుల నాలుగు ద్వారములు కలవు. అందు దూర్పుద్వారము మట్టివాడ దర్వాజాయనియు, దక్షిణద్వారమును భైరవునిగం'గ యనియు, బడమటి ద్వారమును నేనుగుల దర్వాజాయనియు, నుత్తర ద్వారమును భువనగిరి గండియనియు వ్యవహరింప బడుచున్నవి. ద్వారము లన్నింటిసమీపమున గండభేరుండ వీరాంజ