పుట:Andhraveerulupar025958mbp.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిఖరమునగల రహస్యగృహమున కేగి దాగికొనిరి. నాయకులు లేమిచే గొలదికాలము మాత్రము పోరాడి యుక్తాయుక్త మెఱుంగక రాచవారిసైన్యమంతయు వెలమవారికి వశమయ్యెను. హతశేషులగు సైనికులు బ్రతుకుము జీవుడా యని పిఱికి పందలై దొంగత్రోవలను బట్టి పారిపోయిరి. కొంతసేపటికి కినుగుర్తిదుర్గము రాజకులమువారి యధీనమునుండి తొలంగి పద్మనాయకుల హస్తగతమయ్యెను. రాచవారు కొందఱు శిఖరమున దాగియున్న సంగతి రహస్యజ్ఞులచే ననపోతానాయకుదు, మాదనాయకుడు గ్రహించి శైలమునెక్కి యాగృహమునన్వేషించి ద్వారమును ముట్టడించి దొంగత్రోవలన్నింటి నరికట్టి సాహసించి లోనబ్రవేశించి యందున్న కొండ రాఘవరాజు, కొండ్రాజు, జగ్గరాజు, గోవిందరాజు, జూటూరు సూరరాజు, స్వర్ణనేనమరాజు, సాళ్వ రాఘవరాజు, తిరుమల ప్రోలరాజు, కుప్పరాజు, నరసరాజు, శ్రీనాధగౌతమీ భూనాధరాజు, శ్రీపతిరాజు, బాలదేవరాజు, మొదలగువారి నందఱను బంధించి యాక్రందనము గావించుచున్నను శరణుగోరినను, పాదములపై వ్రాలి క్షమార్పణము కోరుచున్నను వదలక దయాశూన్యులై వధించిరి.

బలవంతులగు ననపోతరాయునిచే మాదనాయనిచే ముం దెట్టియపాయములు వచ్చునోయని యాప్రాంతముల నాశ్రయించి జీవించు రాజవంశీయులందఱును దేశత్యాగము