పుట:Andhraveerulupar025958mbp.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నందఱ సమావేశపఱచి జరిగిన విషయము నంతయు నివేదించి స్వామిభక్తి పరాయణులు, శూరవర్యులు నగుసైనికుల నందఱ యుద్ధమునకు సిద్ధముకండని యాజ్ఞాపించెను.

సోమరాజు నాజ్ఞ సుగ్రీవుని యాజ్ఞ వంటి దగుటచే విశ్వాస పాత్రులగు నా సైనికులందఱు సంగ్రామమున కాయితులైరి. శుభ ముహూర్తమున తన రాజ్యమును గీర్తివర్మయను తన మంత్రియధీనము గావించి యుచితబలములతో సోమరాజు కటకమునకు బయలు వెడల సంగ్రామ భేరి మ్రోగించెను.

కటకేశ్వరుడు రాయబారుల వలన సోమరాజు కదనమునకు రానున్న యంశము గ్రహించి సాటి రజన్యులను సాయము రండని లేఖలు వ్రాసి పంపెను. పలువురు రాజులు బలములతో వచ్చి కటకేశ్వరునకు సాయపడిరి. రాను రాను గటకేశ్వరుని బల మమితమయ్యెను. సోమవర్మ సామంతులలో బలువురు స్వామిద్రోహ బుద్ధితో బ్రత్యర్థులై కటకేశ్వరునకు బలములతో దోడ్పడిరి. బల సంపన్నుడైన కటక పరిపాలకుడు తనస్థితికి సోమరాజుస్థితికి గల వ్యత్యాసము గ్రహించి తానును వెంటనే విజయ భేరి మ్రోగింప భటుల కాజ్ఞాపించెను. నియతకాలమున నిరువురు రాజన్యులు సంగ్రామము నిశ్చయించి కొనిరి. కటకేశ్వరుని బలమంతయు దుర్గమున సురక్షితముగ నుండి సంగరము ఘోరముగ గావించుచుండ