పుట:Andhraveerulupar025958mbp.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యానగరపు సరిహద్దులలో బల్లాలదేవుడను హొయిసలి రాజ్యమును బరిపాలించుచుండెను. అతనిరాజ్యము నెటులేని హరించి తమ రాజ్యములో గలుపుకొన వలయునని హరిహరరాయలు, బుక్కరాయలు తీవ్రకృషిచేయుచుండిరి. ఆకస్మికముగా మహమ్మదుతుగ్లకు హొయిసలరాజ్యమునకు రాజధానియగు ద్వారసముద్రమును ముట్టడించి కోటబగులగొట్టి సంపదల నన్నింటిని జూరగొనెను. ఇక నిటనున్నచో నెప్పటికైన నపాయము తప్పదని బల్లాలదేవుడు దక్షిణార్కాడు మండలములోని తిరువణ్ణామలకుబోయి యది రాజధానిగా జేసికొని పాలించుచుండెను. హరిహరరాయలు తన సహోదరులగు కంపభూపతి, బుక్కరాయలు, మారభూపాలుడు, ముద్దరాజు అను నలువురకు విశేషసైన్యమును ఇచ్చి సమస్త రాజుల జయించిరమ్మని పంపగా వారు సమీపముననున్న చిన్నచిన్న రాజుల నంకితులను గావించుకొని రాజధాని చేరిరి. అపుడె బల్లాలరాజుయొక్క రాజ్యము పూర్తిగా గర్ణాటరాజ్యములో గలసిపోయెను. ఆంధ్రదేశమున సుప్రసిద్ధ దుర్గములగా గణింపబడు పెనుగొండ, చంద్రగిరి, ఉదయగిరి, కనకగిరి దుర్గములు విద్యానగర రాజ్యములో గలసిపోయెను. దినదినక్రమమున విద్యానగరరాజ్యము అభివృద్ధిలోనికి వచ్చుట జూచి చిన్నచిన్నరాజులు తమంతతామె యంకితులై సుంకములు చెల్లింపనంగీకరించిరి. కల్పవృక్షములవలె దనకన్ని విధముల సహ