పుట:Andhravedamulurigveda.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దెలియుచుండెను. రానురాను సంస్కృతము నెఱుగనివారు ఇప్పటికి నూటికిఁ దొంబది మంది కలరు. నూటికి డెబ్బదిమంది కర్మలయందాసక్తి కలవారే, వారికి అర్ధమెట్లు తెలియనగును? సంస్కృత గ్రంథములు పాఠములు చెప్పినప్పుడు ప్రారంభ విద్యార్ధులకు గురువులు స్వభాషలోనే అర్ధము చెప్పుచున్నారుకదా! ఆ సంస్కృత భాష్యములలోని వేదార్ధముకూడ దేశభాషలోనే చెప్పవలసియున్నది.

మఱియుఁ గర్మలాచరించితే వచ్చుఫలము ఆమంత్రార్ధము నెఱింగినవానికిం గూడ వచ్చునని "యఉచైన దేవందేవ" = ఎవఁడు దీనినిట్లు తెలిసికొనునో ఆని శ్రుతియుంగలదు. ఇది యిట్లుండ;

వేదము తెలిగించుట కవసరమేమివచ్చె; అని కొందఱు ప్రశ్నింతురు. ఇదివరకు మీఁదవివరించినదేయవసరమని ఉత్తరము కనఁబడుచున్నను ప్రత్యేకించి మరలఁ జెప్పుచున్నాను.

1. పలుజాతీయములయిన యితర భాషాగ్రంథములు తెలిగించుచున్నట్లే భారతీయుల మతమునకుఁ బ్రధానమయిన వేదమును దెలిగించుట ఆంధ్రుల విజ్ఞానాభివృద్ధి కననగును.

2. తెలుగునఁ బురాణేతిహాసములు చదువువారలకు ఆ కథలమూలములు కల వేదముల యర్ధము నెఱుఁగుట అత్యవసరము.

3. ప్రాచీనదేశపరిస్థితి, అప్పటివారి యాచారములు వర్తనములు దెలిసినచో నాచారవర్తనముల పరివర్తనకాలమగు నిపుడు హేయోపాదేయములు గ్రహించుట సులభము.

4. ధర్మనిర్ణయగ్రంథముల ప్రామాణ్య నిర్ణయము. వివిధదేశాచార మతాచార సంఘర్షణకల యీ శతాబ్దమున స్వమత పరిజ్ఞాన సాకల్యము స్వమత క్షేమఁకరము.

5. ఆంధ్రలోకమున జిజ్ఞాసయుఁగలదు. ఎట్లన - గతయేబది సంవత్సరముల నుండి ఆంధ్రులలో ముగ్గురు, నల్వురు వేదమునకు ఆంధ్రానువాద మారంభించి కొద్ది