పుట:Andhravedamulurigveda.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకాశకుల తొలిపలుకు.

1914లో బొంబాయిలో "ఋగ్వేదము"ను ఆంగ్లములోనికిని, మహారాష్ట్రములోనికిని భాషాంతరీకరించి ప్రకటించుచుండిరి. గుంటూరులో నూతనోద్యమములకు ప్రోత్సాహకరుడుగా నుండిన శ్రీయుత ఉన్నవ లక్ష్మీనారాయణగారు మొదలగు స్నేహితులము వేదముల నాల్గింటిని ఆంధ్రభాషలోనికి అనువదింపవలెనని తలంచితిమి. కాని అప్పుడే ఐరోపా మహాసంగ్రామము ప్రారంభమగుటచేతను, బళ్ళారిలోని ప్రముఖులుకొందరు ఆంధ్రానువాదము ఆరంభించిరని తెలియుటచేతను మేము విరమించితిమి. బళ్ళారివారిపని కొంతవరకుజరిగి ఆగిపోయెను. యుద్ధము నాలుగేండ్లు సాగెను. అది ముగిసినపిదప దీనినిసాగింప మరల సంకల్పముకలిగెను. గుంటూరునుండి భావపురికి (బాపట్ల) పోవు న్యాయస్థానముతో బోయి అచట యీ కార్యమును నిర్వహింపవచ్చునని ఆశకలిగెను. ఆ సమయముననే పూజనీయులగు మహాత్మ గాంధీగారు మోహన వేణుగానముపూరించి దేశీయమహాజనసభతో పాటు భారతజాతినంతను స్వాతంత్ర్య సమరరంగమున కాకర్షించెను. అంతటితో రెండవ సంకల్పము వీగిపోయెను. అసహాయోద్యమ తీవ్రప్రచారము సాగుచుండగనే బ్రాహ్మణ, బ్రాహ్మణేతర అసమానత్వమును తొలగించుటకు వేద వేదాంగములను ఆంధ్రీకరించి ఆంధ్రులకెల్లరకు హస్తగతమొనర్చుట భావ్యమని తెలుపుచుంటిమి. కాని ఆసమయమున సహాయమొనర్చుటకు పూనిన ఒకానొక స్నేహితుని పవిత్ర సంకల్పము దురదృష్టవశమున కొనసాగదయ్యె. సాయమొనర్తుమనిన మరియొకరు అకాలమృత్యు వాతబడిరి. స్వాతంత్ర్యోద్యమము నిమ్నోన్నతస్థాయిలలో నడుచు చుండెను. ఇంతలో వినయాశ్రమమును శ్రీముఖ సం|| మార్గశిర బహుళ సప్తమి స్థిరవాసరమున (23 - 12 - 33) మహాత్ములు ప్రారంభించిరి. ఆంధ్రవేదానువాదము ఆశ్రమోద్దేశములలో నొకటియై వరలుచుండెను. సత్యాగ్రహ సిద్ధాంతములోని సర్వధర్మ సమానత్వమను ముఖ్యసూత్రమునకును సర్వమత గ్రంథములను సమానభక్తి