Jump to content

పుట:Andhrapatrika samvatsaradi sanchika 1911.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలగపూడి సుందరరామయ్య పంతులుగారు ఎం.ఏ., బి.ఎల్.

వీరు ఆంధ్రులందఱికిని లలామభూతులు. మద్రాస్ యూనివర్సిటీ పెట్టిన తరువాత మొట్టమొదట ఎం. ఏ. పరీక్షలో గృతార్థులయినవారు వీరే. వీరు 1848 వ సంవత్సరమందు జననమొందిరి. మచిలీబందరునందు నున్న నోబిలు కాలేజీలో వీరు విద్యాభ్యాసముజేసి 1864 లో ఎఫ్. ఎ. ప్యాసుచేసిరి. తరువాత చెన్నపట్టణమునకు బోయి బి. ఏ., ఎం. ఏ. పరీక్షలనిచ్చిరి. వీరు ఎం. ఏ., ప్యాసుచేయువరకు మద్రాసు రాజధానిలో నాపరీక్ష యిచ్చినవారు ఎవరును లేరు. కావున వీరు ఎం. ఏ. పరీక్షనిచ్చినతోడనే 20 తోపులుచేసిరని చెప్పెదరు. ఆంధ్రులకట్టి గౌరవము గలుగజేసిన సుందరామయ్యగారిని ఎంత పొగడినను చాలదు. వీరు బి. ఎల్. పరీక్షకూడ నిచ్చిరి. వీరు డిస్ట్రిక్టు మునసబు పనియు సబ్ జడ్జిపనియు జేసి 1880వ సంవత్సరమున అనగా 32 సంవత్సరములకే పరలోకగరులైరి. వీరు ఇంకను బ్రతికియుండిన యెడల హైకోర్టు జడ్జి అయి యెంతయు గౌరవముజెందియుందురు. వారియకాల మరణమువలన ఆంధ్రులకు నపారమైన నష్టము కలిగినదని చెప్పుటకు సందేహము లేదు.

పూసర్ల చినతమ్మన్న శ్రేష్ఠిగారు.

వీరు విశాఖపట్టణముజిల్లా భీమునిపట్టణము వాస్తవ్యులు. వైశ్య వర్తకులు. ధనికులు, దాతలు.

బసవరాజు గవర్రాజుగారు.

వీరు కందుకూరి వీరేశలింగముగారి ప్రియ స్నేహితులు. వారు చేసిన సత్కార్యములన్నిటియందును జీవించియున్న దినములలో సహాయము సేయుచు వచ్చిరి. కృతజ్ఞతాపూర్వకముగ శ్రీపంతులుగారు గవర్రాజుగారి పెద్దఛాయాపటమును రాజమహేంద్రవర పురమందిరమందుంచినారు.

కోపల్లి వెంకటరమణరావుగారు.

ఈయన బి. ఏ. పరీక్షయందు గడతేరినాడు. వెంకటగిరి యందీయనచే స్థాపించబడిన విద్యాలయము హైస్కూలయి అభివృద్ధిలోనున్నది. జాతీయవాదులలో నొక్కడుగనుండెను. ఆంధ్ర కర్ణాట భాషలయందెక్కువ పాండిత్యము గలవాడు. ఆంధ్రమున కొన్ని నాటకములను రచించెను. వెంకటరమణరావుగారు ఆంధ్రపత్రికను మొట్టమొదట స్థాపించినప్పుడు ఆరుమాసములు సంపాదకుడుగా నుండెను. విషజ్వర పీడితుడై 1909 వ సంవత్సరము ఫిబ్రవరినెలలో గీర్తిశేషుడాయెను.

దాసువారి కుటుంబము కృష్ణాగోదావరిజిల్లాలలో నెక్కువ ప్రఖ్యాతిని గాంచినది. శ్రీరామపంతులుగారు విద్యాధికులగునారుగురు పుత్రుల జనకుడు. ఆంధ్రభాషాకోవిదుడు. ఆంధ్రదేవీభాగవతము మొదలగు గ్రంథములను రచించెను. వీరు మృతినొంది కొన్ని సంవత్సరములయినవి.


వీరు చెన్నపురిలో ప్రసిద్ధికెక్కిన సంస్కృతాంథవిక్రేతలుగనుండిరి. అనేకగ్రంథములను ముద్రింపించిరి. సంస్కృతాంథ్రములలో మంచిపండితులని పేరువడసిరి.

వీరు గుంటూరుజిల్లా కొండవీటిసీమలోని నరసారావుపేటతాలూకా కొప్పరపు గ్రామవాస్తవ్యులు. అన్నగారిపేరు వెంకటసుబ్బరాయలు. తమ్మునిపేరు వెంకటరమణరాయలు. పెద్దవారికి 25 సంవత్సరములును రెండవవానికి 23 సంవత్సరములును వయస్సుండును. వెంకటరాఅయ్లు 11 వ యేటనే పద్యములల్లువాడు. ఇప్పటికి వీరు నూరు నూటయేబది అష్ఠావధానములేమి, శతావధానములేమి చేసియున్నారు. మొట్టమొదట గంటకు నూరుపద్యములను చెప్పగలిగియుండిరి. ఇప్పుడు గంటకు నాల్గునూరులు చెప్పగలరు. ఇప్పటికి సుమారు 30,000 పద్యముల జెప్పినారు. వీరికి సరస్వతులనియు, ఆశుకవిసింహంబులనియు, ఆసుకవిచక్రవర్తులనియు గౌరవములను నాయాపట్టణముల వారిచ్చిరి. వీరు బంగారు పతకహారంబులను ధరించిచున్నారనిన నది అతిశయోక్తికాదు.

వీరు పిఠాపురము సంస్థానమునం దాస్థానకవీశ్వరులుగ నున్నారు. శతావధానము చేయగలరు. ఆంధ్రదేశమం దిప్పుడిప్పుడే కీర్తిని వహించుచున్నారు. కవితాపత్రికా సంపాదకులు.


కృష్ణాజిల్లా తణుకు వాస్తవ్యులు. శతావధానమును చేయుటయేగాక జనోపయోగమయిన గ్రంథములను పెక్కులు రచియించి ప్రసిద్ధి కెక్కినారు. ఈసంచికలో గొన్ని పద్యములచ్చటచ్చట వీరు వ్రాసిపంపినవి ముద్రింపబడినవి.


కంఠమనేని రంగయ్య, హనుమోర రామస్వామిగార్లు.

కవుతవరములో జరిగిన ప్రథమకమ్మ మహాజనసభకు రంగయ్యగారు అధ్యక్షుడుగను రామస్వామిగారు ఆహ్వానసంఘాధ్యక్షుడుగను నుండిరి. ఈసభ సమావేశసంకల్పములు ఫలించినవనుటకు కృష్ణామండలములో నిప్పుడు కమ్మవారిచే నేర్పఱుపబడుచున్న బాలబాలికాపాఠశాలలు పంచాయితీసభలు సాక్ష్యముగనున్నవి.