పుట:Andhra bhasha charitramu part 1.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్రావిడభాషలకును ఆష్ట్రిక్ భాషలకును కొన్ని సంబంధములు నిరూపింపబడినవి. ఈ పరిశోధనములవలన నీరెండు భాషాకుటుంబములకును సంబంధ, మేర్పడిన యెడల నాష్ట్రిక్ భాషలకే సంబంధించిన తెలైంగ్ భాషకును తెలుగుభాషకును సంబంధ మేర్పడవచ్చును. అ సంబంధము తేలువఱకును నీ విషయమై ఇదమిత్థమని చెప్పుటకు వీలులేదు.

పైని వివరించిన గుప్రత్యయ విచారమునకు సంబంధించిన యొక విశేషము గలదు. ప్రాకృత వైయాకరణులు పైశాచీభాష కాంచీ, పాండ్య, పాంచాల, గౌడ, మాగధ, వ్రాచడ, దాక్షిణాత్య, శౌరసేన, కైకయ, శాబర, ద్రావిడ, బాహ్లిక, సహ్య, నేపాళ, కుంతల, గాంధార, సుదేష్ణ, ఘోట, హైవ, కనోజన, దేశములందుండునదని వివరించిరి. ఆర్యభాషల యందు ముండా, ద్రావిడ, భాషల సంబంధమువలన గలిగిన భాషావిశేషములే పైశాచీ భాషలుగా బరిణమించి యుండవచ్చునని హొయర్‌నెల్, సెనార్టు, పండితు లభిప్రాయపడియున్నారు. ఇంతకుముందు గుప్రత్యయాంతములుగా వివరింపబడిన భాషలన్నియు పైశాచీభాషా ప్రదేశములందలి వనిప్రాకృత వైయాకరణులు తెలిపిన ప్రదేశములందే సరిగానుండుట విచిత్రముగా నున్నది. గుణాడ్యుడు బృహత్కథను పైశాచీభాషయందు వ్రాసి యుండెనను ప్రతీతియందు సత్యమున్నచో నాంధ్రభాష పైశాచీభాషావిశేషమై యుండవచ్చును. ఈ యూహల కాంధ్ర వైయాకరణుల యభిప్రాయమును దోడ్పడు చున్నది. ఇందువలన తెనుగుభాష నేడుగూడ కేవలము పైశాచీ భాషతోనే సంబంధించినదని యనుకొనగూడదు. ఒక భాషయొక్క చరిత్రయం దెన్నోమార్పులు కలుగుచుండును. తనతో సంబంధించి నట్టియు సంబంధింపనట్టియు నెన్నోభాషలతో దానికి సంపర్కము కలుగవచ్చును. అందుచేత నాభాష కేవలము మూలభాషా రూపముననే నిలిచియుండుట యసంభవము. అయినను నది మూలభాషా సూత్రముల ననుసరించియే మార్పులను బొందు చుండును. ఈ విషయమై తెనుగునకు సంబంధించినంత మట్టుకు మఱియొకచోట వివరింపబడును.

తెనుగుశబ్ధమును గూర్చి విచారించు నపుడు భరతవర్షమునకు దూర్పు తీరమున వరుసగా నంగ, వంగ, కళింగ, తెలింగ, దేశములున్ననను విషయము గొచరింపక మానదు. కలింగయనగా నెత్తైనదేశము, తెలింగయనగా బల్లపుదేశమనియు గళింగ తెలింగములు వాస్తవముగ నొక్కటేదేశమనియు, గొందఱు చెప్పుదురు. కళింగాంధ్రములకు భాషయొక్కటియే యని కుహున్ పండితు డభిప్రాయపడియున్నాడు. కలింగదేశపు భౌద్దగ్రంధముల భాషయు