పుట:Andhra bhasha charitramu part 1.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ రెండుజాతుల వారికిని వ్రాతవలెనే భాషయు నొక్కటియై యుండబోవును. ఆచార వ్యవహారము లందును మతాది సంప్రదాయము లందును నీరెండు జాతులవారికిని నొకరీతి యైక్యముండినటుల గోచరించును. కన్నడభాష యయిదు విధములుగా నున్నదనియు నందొకరీతి కన్నడమునకు దెళుగన్నడమను వ్యవహారమున్నదనియు, దెళుగన్నడమనగా కన్నడులు తమ మూలస్థానమును విడిచి దూరదేశములకు బోయి తమ భాషను తేలికగా నుచ్చరించుట వలన గలిగిన భాషయనియు, నొక కర్ణాటక లాక్షిణికుడు చెప్పియున్నాడు. ఇట్లే "కుండ" అనగా కొండలయందున్న కన్నడులు మాట్లాడు భాష కుడ గన్నడమనియు, కుడగన్నడమే నేటి కుడగు భాషగా వ్యవహారమందున్న దనియు జెప్పుదురు. ఈ సాదృశ్యము ననుసరించి తెలుగన్నడము తెలుగుగా వ్యవహరింప బడుచున్నదని యూహింపవచ్చును. శబ్దజాలము నందు దెలుగు కన్నడములకు నూటికి డెబ్బదివంతున సమానముగ నున్నది. అట్లే ప్రత్యయాది సంబంధమును మిక్కిలి దగ్గఱగనున్నది. ఈ కారణముల చేత దెలుగు కన్నడము లొకప్పు డేకభాషగా నుండెననియు గాలక్రమమున మాండలిక భేదమునుబట్టి యవి భిన్నము లయ్యెననియు నూహించుట కవకాశము గలదు.

తెనుగు శబ్దములోని గు ప్రత్యయమును గూర్చి కొంత విచారము చేయవలసి యున్నది. గు,కు, క,గ, క్, గ్, ంక్, ంగ్, కి, మొదలగు ప్రత్యయము లంత మందుగల భారతీయ భాషలనుగూర్చి విచారించినచో దెలుగు శబ్దమునందలి గుప్రత్యయ తత్త్వము తెలియవచ్చును. దక్షిణ హిందూ దేశ భాషలలో గన్నడమునకు "హవిక" యను మఱియొక పేరున్నది. తమిళమును కొన్ని ప్రాంతములలో "సొలగ" లేక "షోలగ" యని పిలుతురు. "వుల్‌రంగ్" అనునది తమిళభాషామాండలిక భేదమగు బుర్గండీభాషకు మఱియొకపేరు. నీలగిరులలో దమిళభాషా భేదమగు ఇరులభాషకు "ఎరిలగారు" అను మఱియొక పేరున్నది. తమిళభాషాభేదమగు కొర్వా భాషలో "ఎర్న్‌గ" లేక "సింగ్లి" యను పేరున్నది. కోర్వాభాషకు "కోడా-కూ", కోఱా-కూ అనియు కొరగ, కొర్కూ, కూర్కూ, కోఱ్-కూ, యనుపేళ్లు గూడ నున్నవి. బడగభాషయనునది కన్నడభాషావికారము. దీనిని బడక్ అని కూడనందురు. కొడగుభాష కన్నడభాషావికారము. పేంగ్ అనునది తెనుగుతో సంబంబంధించిన "కుయి" అను భాషకు మాండలిక భేదము. "కోయ్ లోంగ్" అనునది కోంకణీ మళయాళభాషల సమ్మేళనము వలన గలిగినది. భత్కల్, బుత్కల్ అనుభాష మరాఠీభాషావికారమైన కోంకణీభాషా భేదము. "ధనగరీ" యనునది మరాఠీభాషకు మాండలిక రూపము. ఇట్లే