పుట:Andhra bhasha charitramu part 1.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండితు లభిప్రాయపడిరి. మోదోగలింగ మనునది మధూకలింగ శబ్దభవము గాని మూడగు కళింగము అనుదాని మాఱురూపము కాదు. మూడగు కళింగమని త్రికళింగమున కెన్నడును వ్యవహారము లేదు.

తేనె + అగు, అనగా తేనెవలె తియ్యనిదగుటచే తెనుగయ్యెనని కొందఱును తెలి + అగు = తేలికయగు, లేక స్వచ్ఛమగునట్టిది కావున నీ భాషకు దెలుగను నామము వచ్చెననియు గొందఱి యభిప్రాయము. ఈ వ్యుత్పత్తి కేవలము స్వాభిమాన పూరితమని వేఱె చెప్పనక్కఱలేదు. తెన్ అనగా దక్షిణమని తమిళమున నర్థముండుటచే దక్షిణదేశపు భాషగావున దెనుగనుపేరు గలిగినదని కొందఱనుచున్నారు. తమిళులకు దెలుగువా రుత్తరమున నుండుటచేతను, తెలుగువారు తమ్ము దక్షిణదేశపు వారమని చెప్పుకొనుట యసంభవ మగుటచేతను నీ వ్యుత్పత్తికూడ సమంజసముగ లేదు.

కన్నడకవియగు నృపతుంగుడను రాజు తాను రచించిన కవిరాజ మార్గమను లక్షణగ్రంథమున గోదావరినుండి కావేరివఱకుగల ప్రదేశమంతయు గర్ణాటకసంజ్ఞను గలిగియున్నదని చెప్పియున్నాడు. కన్నడమునం దాదికవులగు పంప, రన్న, పొన్న, యనువారు వేంగీదేశవాసులయినట్లు వారి గ్రంధములవలన దెలియుచున్నది. ఇంతేకాక పూజ్యపాదుడు (క్రీ.శ. 470) దండి (క్రీ.శ. 7-వ శతాబ్దము), నాగార్జున (క్రీ.శ. 8 శతాబ్దము), నాగవర్మ (క్రీ.శ. 990), రాజాదిత్య (క్రీ.శ. 1120), మైదునరామయ్య (క్రీ.శ. 1160), మోళిగయ్య (క్రీ.శ. 1160), మరుళదేవ (క్రీ.శ. 1160), మల్లికార్జున పండితారాధ్య (క్రీ.శ. 1160), హరీశ్వర, రాఘవ, కెరెయపద్మరన (క్రీ.శ. 1165), చక్రపాణి రంగనాధ (క్రీ.శ. 1195), పోలాళ్వ దండనాథ (క్రీ.శ. 1223), భీమకవి (క్రీ.శ. 1369), - వీరును నిట్టివారు మఱికొందఱును తెనుగుదేశమువారు కన్నడముస గ్రంథములను రచించియున్నారు. ఓరుగంటియందును హంపీ - విజయనగరమునందును రాజులు తెలుగు కన్నడముల నొక్కరీతిగ బ్రోత్సహించియుండిరి. శ్రీనాథు డానాటి వాడుకను బట్టి కాబోలు తెలుగును కర్ణాటభాష యన్నాడు. ఇట్లే కన్నడదేశము నందును తెను గెక్కువ ప్రచారములోనున్నది. నేటి కర్నాటక దేశమగు మైసూరు సీమయందలి కోలారు, బెంగుళూరు, చిత్రదుర్గము, నందిదుర్గము జిల్లాలయందు చాలవఱకు దెలుగే ప్రచారములోనున్నది. దీనినిబట్టి కన్నడమువారును తెలుగువారును మొదటినుండియు గలసియుండుటయేకాక యొకరిభాష నొకరు బోధపరుచుకొన గలిగియుండిరని యూహింపవచ్చును.