పుట:Andhra bhasha charitramu part 1.pdf/861

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(ఆ) ఆచ్ఛికాంగ్ల పదములు చేరినవి.

అప్పారావు మేస్టరుగారు, తెనుగుడాక్టరు, పశువులాసుపత్రి, మొదలయినవి.

(ఇ) హిందూస్థానీపదములును ఆచ్ఛికపదములును జేరినవి.

జరూరుపని, ఖజానాగది, సామానుబండి, కలముపోటు, కాపలా మనిషి, మేజాబల్ల, సందుగపెట్టె, మొదలయినవి.

(ఈ) ఆచ్ఛిక పదములును హిందూస్థానీపదములును చేరినవి.

బంగారుమొలాము, అంగడిసామాను, మొదలయినవి.

మిశ్రసమాసములలో మఱియొకరీతివిగూడ గలవు. ఇవి యాచ్ఛిక సంస్కృతపదములు కలియుటచే నేర్పడిన కఱకంఠాది సమాసములవంటి వయినను నిట్టివానిని సంస్కృతకవులును దెనుగు గవులును గూడ విశేషముగ వాడియుండుటచే వీనిని బ్రత్యేకముగ బేర్కొనవలసియున్నది. సంస్కృతపదములు (1) ఆచ్ఛిక బిరుద పదములందును (2) ఆచ్ఛిక సంజ్ఞావాచకపదములందును సమసించును. అహోబలు డిట్టివాని నుదాహరించి యున్నాడు.

(1) బిరుదనామములతోడి మిశ్రసమాసములు.

స్వామిద్రోహరగండలాంఛనుడు, పేషణీహనుమంతు బిరుదాంకుడు, చౌహత్తమల్లుడు, హిందూరాయ సురత్రాణుడు ('సురత్రాణ' పదము 'సుల్తాను'నకు సంస్కృతీకరణము), మూరురాయరగండ బిరుదాంకుడు.

(2) సంజ్ఞావాచకపదములతోడి మిశ్రసమాసము.

మాగంటిపట్టణ మహేశుడు, మానూరిపట్టణవరము, అమ్మభూపతి, జమ్ములవంశసంభవుడు, గుఱ్ఱమువంశసంభవుడు, కొల్లాపురశక్తి, కనువరాజవంశజలధి కౌస్తుభాంచితోదయుడు మొదలయినవి.

ప్రత్యేకపదము లనేకములు కలిసి క్లుప్తరూపములను దాల్చు సమాసము లేర్పడుచున్నవి. సమాస మేర్పడునప్పుడు కేవల పదములే కాక, వాని యర్థములును సమసించి యేకార్థమును గలిగించుచుండును. సమాసమునందు చేరనంతకాలమును పదములు తమ ప్రత్యేకార్థములను గలిగి యుండును; కాని, యవి సమాసముల జేరినంతనే తమ ప్రత్యేకార్థములను మఱుగుపఱుచుకొని యస్వతంత్రములై సంపూర్ణసమాసార్థమున లీనములయిపోవును. సమాసమున ననేకపదము లున్నను దానివలన మనస్సున నేదోయొక్కభావము మాత్రము వ్యక్తమగును.

సమాసమునకును దాని విగ్రహమునకును గల భేదమును పతంజలి యిట్లు వివరించి యున్నాడు - 'విగ్రహవాక్యమున నుబలోపము, వ్యవధానము,