పుట:Andhra bhasha charitramu part 1.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

      "పక్ష్చాత్పురస్తాదపి యన్యదేశా
       ఖ్యాతౌ మహారాష్ట్ర కలింగసంజ్ఞా
       వవాగుదక్ పాండ్యక కన్యకుబ్జౌ
       దేశస్సత త్రాస్తిత్రిలింగనామ.
       పురా త్రిమ్లింగాన్ ప్రతిమంచి కొండా
       వావానయన్ నాయకవంశ ముఖ్యౌ
       తాభ్యాం వినిర్మాపితమాత్మ నామ్నా
       పురం మహచ్చ ప్రథితేంధ్రదేశే."

అను శ్లోకము ఎపి గ్రాఫియా ఇండికా 14-వ సంపుటమున వ్రాయబడియున్నది. శా.శ. 1539 సంవత్సరమున మీసర గండకఠారిసాలువ తెలుంగురాయు డుండినట్లొక శాసనమువలన దెలియుచున్నది. ప్రతాపరుద్రీయమున త్రిలింగశబ్దము వాడబడియున్నది. అల్లాఉద్దీనను తురుష్కరాజు తిలంగదేశమును జయించినట్లు తెలియుచున్నది. తిలుంగు బిజ్జలుడనువాడు నెల్లూర రాజ్యమేలిన తెలుగుచోడుల వంశములోనివాడు. ఈరీతిగానున్న దేశపుపేళ్లను సంస్కృతీకరించి త్రిలింగ శబ్దమును పండితులు కల్పించినారని యనుకొనుట కవకాశమున్నది.

తెలుగుశబ్దము త్రినగశబ్ద భవమని మఱికొంద ఱందురు. మహేంద్రము, శ్రీశైలము, కాళహస్తి యను మూడు నగముల మధ్యనున్న ప్రదేశము త్రినగదేశమనియు ద్రినగశబ్దమే తెనుగుగా మాఱినదనియు వారి యభిప్రాయము. త్రినగశబ్దము నందు లేని యనుస్వారము తెనుగుశబ్దమునం దుండుటయు, తెనుగుదేశమునకు ద్రినగమను వ్యవహార మేనాడును లేకుండుటయు నీ వ్యుత్పత్తి కాథారము లేనట్లు తెలుపగలదు.

త్రికళింగ శబ్దభవము తెలుగని మఱికొంద ఱనుచున్నారు. త్రికలింగశబ్దము ప్రాకృతమున 'తిఅలింగ' యని మాఱి తెలింగ, తేలింగ యనురూపములను పొందుట సాధ్యమేయయినను తెనుగుదేశ మంతటికిని త్రికలింగసంజ్ఞ లేకుండుటచే నీ వ్యుత్పత్తియు నిరాథారమగు చున్నది. త్రికళింగ మనున దిప్పటి గంజాము, విశాఖపట్టణము జిల్లాలును వానికి పడుమట మధ్యపరగణాలలోని కొంతభాగమును నయి యుండెను. నేటి ముఖలింగమున్న ప్రదేశమునకు మోదోగలింగే యను పేరు గ్రీకు చరిత్రకారుల వ్రాతలయందు గాన్పించుచుండుటచే మోదో అనగా మూడగు అని అర్థము చెప్పుటచే త్రికళింగమునకు మూడగు కళింగమని యర్థముచెప్పి యాత్రికళింగమునుండి తెలుగను పదము పుట్టినట్లు కేంబెల్ మొదలగు పాశ్చాత్య