పుట:Andhra bhasha charitramu part 1.pdf/858

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(1) సముచ్చయదీర్ఘము లోపించుట.

అంటుసొంటులు, అడుగుమడుగులు, అప్పుసప్పులు, అరమరలు, అఱగొఱలు, ఆకలములు, ఊరువాడలు, ఎగుడుదిగుడులు, కుండమండలు, కూరనారలు, కూలినాలులు, గడ్డిగాదరలు, గుట్టుమట్టులు, గుడ్డగుడుసులు, గొడ్డుగోదలు, చదువుసంధ్యలు, చిలుకుమలుకులు, చిల్లరమల్లరలు, చెత్తచెదారములు, చెఱపుమఱపులు, జంకుగొంకులు, డబ్బుదసకములు, డొక్కుడోలులు, పిల్లజెల్లలు, పే(బీ)దసాదలు, బుగ్గిబూడిదలు, భూమిబుట్రలు, మడిమట్రలు, మందుమాకులు, మన్నుమశాణములు, మన్నుమిన్నులు, మాలమాదిగలు, మాటమంతులు, మిన్నుమన్నులు, ముద్దుముచ్చటలు, మూటముల్లెలు, మూతముప్పిడులు, మేడమిద్దెలు, రండిమొండులు, రవ్వరట్టులు, రాయిరప్పలు, లొడ్డులొసుకులు, వెఱ్ఱిమొఱ్ఱులు, వేరు వెల్లంకులు.

పై వానిలో సముచ్చయదీర్ఘము రెండుపదములమీదను లోపించి రెండవపదము తుదిని బహువచనప్రత్యయము చేరుట కానవచ్చును. మొదటి పదము హ్రస్వమగునపుడు దానిపై బరుషములు పరమగుచో దాని కొకప్పుడు గ స డ ద వాదేశము కలుగును; ఒకప్పుడు నేటి వ్యవహారమున గలుగదు. పూర్వకాలమున గలుగుచుండెడిదేమో.

(అ) గ స డ ద వాదేశము కలుగుటకు.

కాయగసురులు, కాలుసేతులు, కూరగాయలు, చడిసప్పుడులు, చిదుగు సిట్రలు, చెట్టుసేమలు, చెత్తసెదారములు, చేనుసెట్రలు, తిట్టదిన్నెలు, పసుపుగుంకములు.

(ఆ) గ స డ ద వాదేశము నేడు కలుగనందుకు.

అడపొడలు, ఆటపాటలు, ఆరుపోరులు, ఆశపాశలు, ఆస్తిపాస్తులు, ఊరుపేరులు, ఎక్కువ తక్కువలు, ఎచ్చుతగ్గులు, కఱ్ఱకంపలు, కాయకసురులు, కౌలుకదపాలు, గట్టుపుట్టలు, గుండపిండులు, తల్లిపిల్లలు, తిండితీర్థములు, తోలు తొపారములు, పాడిపంటలు, పిన్న ప్[ఎద్దలు, పిల్ల పేకలు, పిసరుపిప్పులు, పురుగుపుట్రలు, పెట్టపేడలు, పెద్దపిన్నలు, పేరుప్రతిష్ఠలు, పోలుపొందులు, రాకపోకలు.

(2) మొదట పదము తుది ము వర్ణము లోపించుట.

అడ్డదిడ్డములు, ఉచ్చనీచములు, జీతనాతములు.

మువర్ణము లోపింపగా గలిగిన పదముపై బరుషములు నిలిచినచో వానిక గ స డ ద వా దేశము నేడు గలుగదు; పూర్వకాలమున గలుగు చుండెడిదేమో.