పుట:Andhra bhasha charitramu part 1.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు గాన్పింపవు. క్రీస్తుశకము 4,5, శతాబ్దముల నుండియు బల్లవరాజుల కాలమున సంస్కృతమునకు బ్రాధాన్యముగలిగి ప్రాకృతముల ప్రచారము వెనుకపడినట్లు గాన్పించును. ఈలోగా బ్రాకృతము మార్పుజెందుచు వచ్చెను. దానికిని నితరభాషలకును వ్యవహారమునం దొలుతనుండియు గలుగుచుండిన సంపర్కమువలన గ్రంధస్థలాక్షణిక ప్రాకృతమని గుర్తింపరాని యొక యవస్థ యేర్పడెను. ఈ తొల్లింటి ప్రాకృతమే మార్పునొందుచు నేటి యాంధ్రభాషగా బరిణమించినదా? అట్లైనచో నా పరిణామక్రమ మెట్టిది? ఆ ప్రాకృతభాషా స్వరూపమెట్టిది? దానితో మేళనము బొందిన యితరభాషల స్వరూపమెట్టిది ? ఆంధ్రమునకును నితర ద్రావిడ భాషలకును గల సంబంధమేమి? - అను విషయములను గూర్చిన చర్చ యీ గ్రంధమున నందందు గాన్పింపవచ్చును. ఆంధ్రము ప్రాకృతభాషా వికారమగు నేమో యను దృష్టితో నీగ్రంధము వ్రాయబడుటచే బ్రాకృత భాషలగూర్చిన ప్రశంస యిందెక్కువగా గాన్పించును.

ఈభాష కాంధ్రమనుపేరు నన్నయభట్ట రచితమైన నందంపూడి శాసనమున దొలుత గానవచ్చుచున్నది అందాతడు నారాయణభట్టు నాంధ్రభాషా కవీశ్వరునిగా బేర్కొనియున్నాడు. ఆనాటికే యీభాషకు దెనుగను నామము గురుగుకొని యుండెను. భారతమును తెనుగున రచింపుమని రాజరాజు తన్ను గోరినట్లు నన్నయభట్టు చెప్పియున్నాడు. ఈ తెనుగను పదము స్వరూపమునుగూర్చి విచారింతము.

తెలుగనుపదము త్రిలింగ శబ్దభవమని పండితుల యభిప్రాయము. ద్రాక్షారామ, శ్రీశైల, కాళహస్తులను మూడు ప్రసిద్ధ శైవక్షేత్రములకు నడుమనున్న దేశము త్రిలింగమనియు నదియే తెలుగుదేశమనియు నప్పకవి చెప్పియున్నాడు. అంతకుబూర్వము కాకతీయులు రాజ్యముచేసిన దేశమునకు ద్రిలింగమని యనుకొనుచుండినట్లు విద్యావారి కవికృతమగు ప్రతాపరుద్రీయమున బ్రతాపరుద్రుడు త్రిలింగాధిపతియని చెప్ప బడుటచే దెలిసికొనవచ్చును. అంతకు బూర్వము తెలుగుదేశమునకు ద్రిలింగసంజ్ఞ యుండెనో లేదో తెలియదు. శాసనములం దీదేశమునకు తెలింగ, తెలుంగ, తిలుంగ, తిలంగ, తెలగ, తిలింగ, యనుపేళ్లు గానవచ్చుచున్నవి. శా.శ. 1194 ప్రాంతముల రాజ్యమేలిన యాదవరాజగు రామచంద్రునికి "తెలింగ తుంగ తరూన్మూలన దంతానల" యను బిరుదముండినట్లు తెలుపబడినది. కుంతల దేశాధీశుడగు రాచమల్లదేవునకు బెలగలమారి యను బిరుదముండెను.