పుట:Andhra bhasha charitramu part 1.pdf/837

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెనుగున నాచ్ఛికసమాసములు గలుగునప్పుడు తఱచుగ స్త్రీసమపదము లొకదానివెంబడి నొకటిచేరుచు నెట్టి వికారములను బొందకుండ నిలుచును, జున్నుగడ్డ, సేడుకఱ్ఱ, వాడవదినె, పోగుపోత మొదలగునవి. పూర్వపదము లౌపవిభక్తికము లగుచో నౌపవిభక్తిక రూపములతోడనే నిలువ వచ్చును: ఇంటికప్పు, జుంటితేనె, కంటిపాప, వాతిబియ్యము; - కన్నీరు, జున్నుగడ్డ, అనురీతిగా నుపవిభక్తులు చేరకయు నుండవచ్చును.

బహువ్రీహిసమాసములం దుత్తరపదమొకప్పు డౌపవిభక్తికముగ నుండవచ్చును: ముక్కంటి, కడలిచూలి, వెడవింటి మొదలయినవి. ఇట్టివానియం దుత్తరపదముపై జేరిన యివర్ణము మత్వర్థీయ తద్ధిత ప్రత్యయమైనను గావచ్చును. ఉపవిభక్తులు చేరియే కాక యితర లోపాదేశాగమములు గలిగియు నాచ్ఛికసమాసము లేర్పడుననుట కుదాహరణము లింతకుముందీయ బడినవి. పూర్వపదముగాని, యుత్తరపదముగాని వికారము పొందక యుండు నాచ్ఛికపదములు మూటికంటె నెక్కువగజేరి సాధారణముగ సమాసములు కానేరవు. సందెమల్లియసౌరు, మొదలయినవి. గాలిమేపరి పాన్పువాడు, కడలిరాచూలియల్లుడు - ఇట్టి సమాసములు తెనుగునకు సహజములుకావు. కొన్నిపదములయినను వికారమును బొందినచో నాచ్ఛికసమాసము కొంత దీర్ఘము కావచ్చును: వంటయింటికుందేటివడువు మొదలయినవి.

సమాసమనుపదమునకు శబ్దపరముగను నర్థపరముగనుగూడ వ్యాఖ్యానము చేసికొనవచ్చును. వ్యాకరణమునకు శబ్దముతోడనే కాని యర్థముతో సంబంధముండదు. అర్థము న్యాయమునకు సంబంధించినది. కాని, శబ్దార్థముల కవినాభావసంబంధ ముండుటచే నా రెండిటిని విడదీయ వీలులేదు. కాని, వైయాకరణులును నైయాయికులును వానిని వేఱుచేసి యొండొరులతో బోరాడుట సంప్రదాయమైనది. శాబ్దికులు తాము కల్పించుకొనిన సంకేతములను పడియచ్చులలోని కాయారూపముల నిఱికింప జూతురు. అట్లుచేయుట యర్థవిరుద్ధమును నసహజమునైనను వ్యాకరణశాస్త్రము ప్రకార మారీతిగనే వ్యాఖ్యానింపవలెనని శాసింతురు. నైయాయికు లీ మార్గమున కొప్పుకొనక యర్థమునకే ప్రాధాన్యము నిత్తురు. సమాసములవిషయమున మాత్రము శాబ్దికులు నైయాయికమతమునకు లోబడక తీఱినదికాదు. సమాసములందు పృథగ్భూతంబులైన యర్థంబుల కేకార్థీభావము కలుగును. అ ట్లేకార్థీభావము నొందగలపదములే సమర్థములై సమసింప గలవు. కావుననే పృథగ్భూతంబులయిన పదంబు లేకపదంబగుట సమాసంబగునని చెప్పక, సమర్థంబులయి పృథగ్భూతంబులయిన పదము లేకపదంబగుట సమాసం బగునని చెప్పవలసివచ్చినది.