పుట:Andhra bhasha charitramu part 1.pdf/834

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రహితరూపములు తరువాతికాలమున వ్యాప్తినొందినవి. (చూ. వరాహా. VI. 16.) ఇట్లే 'నినుబోలు సాధ్వి' (రామాభ్యు. V. 78) వంటి రూపములు 'పోలు' అను క్రియాజన్యవిశేషణములతో రానురాను భాషయందు చేరినవి.

4. పోలె.

'పోలెన్‌' తోడి యివార్థకరూపములు భారతానంతరమునకు నిలిచినవి - ఉదయించు వడువువోలె (కుమా. భా. I. 272); కలభాషిణికి బోలె (కళా. II. 36); మోహిబోలె (పాండు. II. 219; భారతభాషప్రకారము 'మోహియుంబోలె' అని యుండవలెను); చూచుటకుంబోలె (పాండు. III. 93); ఏనుబోలె (కాశీ. I. 10); ఎఱుగనిదానిబోలె (శకు. పరి. III. pu. 54); ననుబోలె; నినుంబోలె (శశాం. III.); అట్లపోలె (వరాహ. II. 19).

పై యుదాహరణములనుబట్టి 'పోలె' పరంబగునపుడు దానికి బూర్వమందున్న పదము ప్రథమా, ద్వితీయా, షష్ఠీ విభక్తులం దుండవచ్చుననియు, అస్మద్యుష్మచ్ఛబ్దంబులు మాత్రము దానికి పూర్వపదములై, ప్రథమయం దుండవనియు దెలియనగును.

పదునాఱవశతాబ్దమునాటికి 'వలె, బలె' అనునవి యివార్థములుగ గ్రంథములందు గానవచ్చుచున్నవి.

5. వలె.

i. ప్రథమపై: పుప్పొడివలె (వరాహ. IV. 168); ఇంద్రుండువలె (వరహ. III. 53); దోసకాయలువలె (వరాహ. III. 24); గుండువలెన్ (పాండు. V. 240).

ii. ద్వితీయపై: మనతోటన్వలె (రామాభ్యు. V. 37); ఇంద్రున్వలెన్ (ఉ. రా. I. పు. 22).

iii. షష్ఠిపై: మీవలెనె (ఉ. రా. పు. 33); తనవలె (ఉ. రా. V. పు. 91); నీవలె (పాండు. Vi 19); వారివలెన్ (ఉ. రా. పు. 165).

iv. క్రియపై: తిప్పకాయవువలె (ప్రభులిం. పు. 66.)

v. అవ్యయముపై: ఇటువలె (రామాభ్యు. VI. 65; వరాహ. V. 92; ఉ. రా. పు. 14; దశావ. పు. 58); మున్నువలె వరాహ. V. 124.)

6. బలె.

i. ప్రథమపై: మీరుబలె (వరాహ. II. 88); నేనుబలె (వరాహ. II. 51); పెద్దవాడు బలె (ఉ. హరి. IV. 65).

ii. ద్వితీయపై: సముద్రముంబలె (రామాభ్యు. VII. 188); వీరి వారింబలెన్ (వరాహ. II. 13).