పుట:Andhra bhasha charitramu part 1.pdf/829

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పడగదాల్పు, తేనెదిండి ఇట్టివి ద్వితీయాతత్పురుషసమాసములు, 'పట్టు బుట్టము దాల్పు' అనునది యలుగ్ద్వితీయతాతత్పురుషసమాసము. ఉలితునక, నెలతక్కువబిడ్డ, ఇత్యాదులు తృతీయాతత్పురుషసమాసములు. 'ఉలితునుక' షష్ఠీతత్పురుషసమాసము కూడ గావచ్చును. 'దేవరమేలు' మొదలగునవీ చతుర్థీతత్పురుషసమాసములు. 'దొంగయలుకు' ఇత్యాదులు పంచమీతత్పురుషసమాసములు. దొరమానిసి, తేటిపిల్ల, మల్లెపూవు, జాబిల్లి వెన్నెల, గట్టుపట్టి, రాచకొలము, నేతిముంత, కూటికుండ, ఇత్యాదులు షష్ఠీతత్పురుషసమాసములు. 'మాటనేర్పరి' మొదలగునవి సప్తమీతత్పురుషసమాసములు.

డాలుడమాములు, కుంచెకాళంజులు, కాలుసేయి, ఊరుపల్లెలు, తల్లిదండ్రులు, కీడుమేళ్లు, వెన్నెలచీ(సీ:)కట్లు, పగలురేలు, కన్నపెంచినవారు, విన్నకన్నవారు, ఇట్టివి ద్వంద్వసమాసములు. కన్న పెంచినవారు, విన్నకన్నవారు మొదలగువానిలోని తుది 'వారు' అను తచ్ఛబ్దము సమాసము తొలిపదముతోడను అన్వయించును. వచ్చి రాములు, చేసిచేయములు, చొచ్చిచొరములు, అను ద్వంద్వసమాసములును సాధువులే. క్త్వార్థకశబ్దముతోడను గొన్నియెడల ద్వంద్వసమాసములు గలుగవచ్చునని యధర్వణుడనెను. (ఇట్లే వచ్చుచుపోవుచుండువారు, వచ్చుపోవువారు, వచ్చుచున్న పోవుచున్నవారు మొదలగునవియు ద్వంద్వసమాసములే యనవలెను.) 'వచ్చీరానిమాటలు' ఇట్టి సమాసములప్రామాణికములు. "వచ్చియును రానిమాటలు" అనుట సాధువగును. (కాని యిట్టి ప్రయోగములు గ్రంథములం దనేకములున్నవి. వినీ వినమింబురిలోని సైనికుల్ (జైమి.); వినీ విననిభంగి (నైష. VI. 33); నరపతి నమ్మీనమ్మక (భార. శాంతి. II. 351 1901. ముద్రణము.) ద్వంద్వసమాసములు సాధారణముగ బహువచనాంతములుగ నుండును. కాని, యొకప్పుడవి యేకవచనాంతములుగ గూడ నుండవచ్చును. అప్పుడవి సమాహారద్వంద్వములగును: కాలుసేయాడు తఱియంద కదలవలయు (కాశీఖండము); కాలుసేతి బల్‌త్రొక్కుల (ఆముక్తమాల్యద); అరయంగా బిన్న పెద్దయై యతడుండున్ (కాశీఖండము); కూడు సీరకునింటగొదలేక యుండునే (హరవిలాసము); సంసారంబు వదల విడిచి కూడుసీరకు నవసియుండునట్టివాడు (భారతము: శాంతిపర్వము); ఇట్టి ప్రయోగములనేకములు గలవు.) - వ్యవహారమున 'కూడూగుడ్డా, కూరాగాయా, కాలూచేయీ, పిన్నాపెద్దా, రాకాపోకా; ముందూవెనుకా, ఱేపూమాపూ, గొడ్డుగోదా - అని యీ రీతిగా సముచ్చయ దీర్ఘము రెండుపదముల మీదను చేరుచుండును. గ్రంథములం దుత్తరపదము మీదగాకున్నను బూర్వపదము మీదనయినను సముచ్చయ దీర్ఘము గలిగిన