పుట:Andhra bhasha charitramu part 1.pdf/820

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(28) చన్నీళ్లు, వేణ్ణీళ్లు, పేణ్ణీళ్లు, ఏణ్ణాళ్ళు, ముణ్ణాళ్ళు, విజ్జోడు, ఇన్నూఱు, మున్నూఱు, నన్నూఱు, ఏణ్ణూరు మొదలగువానిలో పరపదాది నకారము పూర్వపదాంత్య హల్లుతో గలిసి దానికి వికారము గలిగించినది.

(29) నిర్ +కడి = నిగ్గడి; నిర్ + కాక = నిక్కాక; ఈ సమాసములలో 'నిర్‌' అనునది 'ఎక్కువ' అను నర్థముగల యుపసర్గము.

(30) చిఱు, కుఱు, నడు, నిడు అను శబ్దములపై నచ్చు పరమగునప్పుడు ద్విరుక్త టకారమగును: నిట్టుపాసము, నిట్టూరుపు, నట్టడవి, కుట్టునురు, చిట్టంటుచేతలు, నట్టుంట్లు, నట్టేఱు, నట్టిల్లు.

ఒకప్పుడు ద్విరుక్త టకారము రాదు: చిఱ్ఱుద్ది. ఒకప్పుడు 'ట్ర' కలుగును: నిట్రుపాసము.

(31) కొన్నియెడల బూర్వపదము తుదియచ్చునకు దీర్ఘము కలుగును: తారాపీట, గునామొలనూలు, పెద్దాపురి, మచిలీపట్టణము.

(32) కొన్నియెడల బూర్వపదముపై గొన్నివర్ణము లాగమములుగా వచ్చును: తెల్లనాకు, చిటికెనవ్రేలు, బొట(-ట్ట)నవ్రేలు, బొటకనవ్రేలు, బొటమనవ్రేలు.

(33) కొన్నియెడల నుత్తరపదము నాది హల్లునకు లోపము గలుగును: పెందలాడ.

(34) సమాసమున బూర్వపదముగా నిలిచిన 'పది' శబ్దమునకు గలుగు మార్పు లీ క్రింది సమాసములవలన దెలిసికొనవచ్చును: పదకొండు, పదనొకండు, పదునొకండు, పండ్రెండు, పన్నెండు, పదుమూడు (పద్మూడు), పదునాలుగు (పద్నాలుగు), పదునేను (పదిహేను), పదునైదు (పదహైదు), పదునాఱు (పదహాఱు), పదునేడు (పదిహేడు), పదునెనిమిది (పద్ధెనిమిది, పజ్ఝెనిమిది), పందొమ్మిది (పంతొమ్మిది).

(35) సమాసమున నుత్తరపదముగానున్న 'పది' శబ్దమునకు గలుగు మార్పు లీ క్రింది సమాసములవలన దెలిసికొనవచ్చును: ఇరువది (ఇరువై, ఇరవై), ముప్పది, (ముఫ్ఫై), నలువది, నలుబది (నలభై), ఏబది (యాభై), అఱువది (అరువై, అరవై), డెబ్బది (డభ్భై), ఎనుబది (ఎనుభై, ఎనభై), తొంబది (తొంభై.)

(36) ఎనిమిది, తొమ్మిది, అను పదములు సమాసమున బూర్వపదము లగునపుడు గలుగు మార్పుల నీ క్రిందివానియందు గమనింపవచ్చును: ఎనమన్నూఱు, తొమ్మన్నూఱు, ఎనమనూఱు, తొమ్మనూఱు, తొంబనూఱు.