పుట:Andhra bhasha charitramu part 1.pdf/819

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(19) కొన్నియెడల ధాతువుల తుదివర్ణము లోపించియు నితర వికారములు గలిగియు నేర్పడిన రూపములపై 'ప', 'పన' మొదలగు వర్ణములు చేరును: తిరుపగూడ, కలపనబిండి మొదలగునవి.

(20) కొన్నియెడల పూర్వపదము తుది వర్ణమునకు 'పు' వర్ణము గలుగదు: బోగమాట.

(21) కొన్నియెడల బూర్వపదముగా జేరిన ధాతువులపై 'రు', 'డు' వర్ణములు చేరును: వేగురుజుక్క; త్రొక్కుడుబట్టె, త్రొక్కుడుగమ్మి, త్రొక్కుడుబలక, చోపుడుగోల, చూపుడుబూట, చెక్కుడు బాఱ, ఎక్కుడుదీగ, దో(గో)కుడుబాఱ, తిరుగుడుజీల, తిరుగుడుద్రాడు.

(22) ధాతుజ విశేషణములతో సమాసములు గలుగును: పుట్టినిల్లు, మెట్టినిల్లు, కలరూపు, ఉన్నరూపు.

(23) ధాతువుల క్త్వార్థక రూపములును సమాసములందు పూర్వపదములుగా నుండును: పంచివేత, తేఱిచూపు.

(24) ఒకప్పుడు సంపూర్ణ క్రియారూపములును సమాసములందు పూర్వపదములుగా నుండును: లేదుబంతి.

(25) కొన్ని సమాసములలో బూర్వపదము షష్ఠీబహువచన రూపము గలిగియుండును: అట్లతదియ, నాగులచౌతి, పాలగరువు, పాలగోకుడు, పాలపండ్లు, పాలబుగ్గలు, పాలమన్ను, పాలవిఱుగుడు, పాలసున్నము, పాలగచ్చు, పాలగార; ఆలపోతు, కట్లబల్ల, కట్లగుదియ, గీట్లబ్రద్ద, చేఱులకోల, పూలముడుపు, పెట్లకంబము, ప్రొద్దులనెల, మల్లెలగుది, మేకలమంద, సకినలమంచము మొదలయినవి.

(26) కొన్నియెడల బూర్వపదము తుదివర్ణము లోపించును: వంజెఱగు, మొగవీణె, మీసకట్టు, వ్రేపల్లె, ఎనుపోతు, ఎనుపెంటి, పూరేకు, పూనీరు, పూదోట, చేవ్రాలు, చేపట్టు, వాదోడు, నానుడి, పిరువీకు, బల్లెకోల, నెత్తపలక, గందపొడి, ఊర్సోక, వాచూరు, దూముడి, చాపరువు, చిక్కోల.

(27) కొన్నియెడల బూర్వపదము తుదియచ్చుమాత్రము లోపించును: కందెఱ, పెంద్రోవ, పెందొడవ, పెందెరువు, కన్నీరు ('కన్ను నీరు' అనియు బ్రయోగము గలదు). పుట్నిల్లు, పార్పత్తెము, నిట్రాయి, నిట్రాడు, చట్రాయి.