పుట:Andhra bhasha charitramu part 1.pdf/805

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోని 'న'కారమునకు 'ణ'కారము వైకల్పికముగా నగును: దూర్వావణము, దూర్వావనము; శిరీషవణము, శిరీషవనము. 'ఇరికా' మొదలగు పదముల మీదివనశబ్దమున నీ మార్పు గలుగదు: ఇరికావనము, మిరికావనము. పూర్వపదము ద్వ్యక్షర త్ర్యక్షరపదమగునపుడే యీ మార్పు కలుగును.కావున, 'దేవదారువనము' అనుసమాసమున 'న' కు 'ణ' రాలేదు.

పూర్వపదమునందు 'న' ను 'ణ'గా మార్పగల వర్ణముండి అది మోయబడువస్తువు పేరైనపుడు పరమందువచ్చిన 'వాహన' శబ్దమందలి నకారమునకు ణకారమగును: ఇక్షువాహణము. కాని, ఇంద్రవాహనము అను సమాసమునకు ఇంద్రునికి సంబంధించిన వాహనము అనునర్థము గావున 'న'కారము ణకారముగ మాఱలేదు.

సమాసమునకు దేశము, జనులు, అనునర్థముండి, యందలిపూర్వపదమునందు నకారమును ణకారముగ మార్పగల వర్ణముండెనేని, పరపదముగా వచ్చిన 'పాన' అనుపదమందలి నకారమునకు ణకారము వచ్చును: ఉశీనరులు - క్షీరపాణులు; ప్రాచ్యులు సురాపాణులు.

సమాసమునకు భావకరణార్థము లున్నప్పుడు పై సందర్భములందు, 'పాన' శబ్దములోని నకారమునకు ణకారము వైకల్పికముగా నగును: క్షీరపాణము - క్షీరపానము = పాలుత్రాగుట; క్షీరపాణము, క్షీరపానము = పాలుత్రాగు పాత్రము.

గిరినదీ, చక్రనితంబా, మొదలగు సమాసములం దీ మార్పు వైకల్పికముగ నగును: గిరినది, గిరిణది; చక్రనితంబ, చక్రణితంబ మొదలయినవి.

(21) గోవుయొక్క పాదము 'గోపదము' గోవులు సంచరించు స్థలము 'గోష్పదము'; గోవులు సంచరింపని స్థలము 'అగోష్పదము'; గోవుపాదమంత భూమి 'గోష్పదము'

'ఆ + పదము' అనునప్పుడు 'స్థానము, ప్రతిష్ఠ' అను నర్థములందు 'ఆస్పదము' అని సమాసమగును: 'పదమువఱకు' అనునర్థమున 'ఆపదము' అగును.

(22) 'ఆ + చ్చర్యము' అనునపుడు 'వింత' అనునర్థమున 'ఆస్చర్యము' అగును; ఈ యర్థములేనప్పుడు 'ఆచర్యము' అగును.

(23) 'అవ + కర' అనునది 'ఆవస్కరము' అయి 'అన్నమలము' అను నర్థమును పొందును. 'ముడ్డి' అనునర్థమునను 'అవస్కరము' అని యగును, ఈ యర్థము లేనప్పుడు 'అవకరము' అని యగును.