పుట:Andhra bhasha charitramu part 1.pdf/798

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఘోష, మిశ్ర, శబ్ద అనుపదములు పరమందున్న పాదశబ్దమునకు 'పద్‌' అనునదా దేశమగును: పద్ఘోషము, పాదఘోషము; పన్మిశ్రము, పాదమిశ్రము; పచ్ఛబ్దము, పాదశబ్దము.

(6) సమాసము సంజ్ఞావాచక మగునపుడు 'ఉదక' శబ్దమునకు 'ఉద' అనునాదేశము కలుగును: ఉదమేఘుడు = ఒక మనుష్యుని సంజ్ఞ.

ఉదకశబ్దము పరమందున్న సమాసముగూడ సంజ్ఞావాచకమగునపుడు 'ఉదక' కు 'ఉద' ఆదేశమగును: క్షీరోదము.

పేషం, వాస, వాహన, ధి, అనునవి పరమందున్న ఉదకశబ్దమునకు 'ఉద' ఆదేశమగును: ఉదపేషముగా నూఱుచున్నాడు; ఉదవాసము, ఉదవాహనము, ఉదధి.

నీటిచే నింపబడిన వస్తువుపేరు ఒక్కటే పొల్లు ఆదియందుగలది పరమగునప్పుడు 'ఉదక' శబ్దమునకు 'ఉద' ఆదేశమగును: ఉదకుంభము, ఉదకకుంభము; ఉదపాత్రము, ఉదకపాత్రము. ఏకహలాది శబ్దము పరమందున్నపుడు: ఉదకస్థాలి.

మంథ, ఓదన, సక్తు, బిందు, వజ్ర, భార, హార, వీవధ, గాహ అనుపదములు పరమందున్న 'ఉదక' శబ్దమునకు 'ఉద' అను నాదేశము వైకల్పికముగా నగును: ఉద (క) మంధము, ఉదోదనము, ఉదకోదనము, ఉద (క) సక్తు; ఉద (క) బిందువు, ఉద (క) వజ్రము; ఉద (క) భారము, ఉద (క) హారము, ఉద (క) వీవధము, ఉద (క) గాహము.

(7) సమాసమున నుత్తరపదమునకు బూర్వమందుండు ఈ, ఊ, ౠ లకు హ్రస్వము కలుగును; స్త్రీ ప్రత్యయమగు జీ (ఈ) అనుదానికి మాత్రము కలుగదు.

గ్రామణి (ణీ) పుత్త్రుడు; బ్రహ్మబంధు (-౦ధూ) పుత్తుడు. అవ్యయీభావసమాసములందును, విభక్తులుఇయజ్, ఉవజ్, ఆగమములను బొందు పదములందును ఈ మార్పు గలుగదు: శ్రీమదము, భ్రూభంగము, శుక్లీభావము.

కాని, భ్రూకుంసుడు, భ్రుకుంసుడు, భ్రూకుటి, భ్రుకుటి, అను రెండేసి రూపములు గలవు.

(8) తద్ధితప్రత్యయము పరమందున్న 'ఏకా' అనుపదము సమాసమున బూర్వపదమైనపుడు దాని తుది దీర్ఘమునకు హ్రస్వము గలుగును: ఏకస్యా: అగతమ్ = ఏకరూప్యమ్ (తె. -ము); ఏకస్యా: క్షీరమ్ = ఏకక్షీరమ్ (తె. - ము).