పుట:Andhra bhasha charitramu part 1.pdf/788

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(22) సమాహారద్వంద్వసమాసము నంతమున చవర్గీయ హల్లుగాని, ద, ష, హ అను హల్లులుగాని పరమగుచో దానిపై 'టచ్‌' ప్రత్యయము చేరును.

VI. ఏకశేష సమాసము.

ద్వంద్వసమాసమున జేరిన పదములన్నియు గొన్ని వికారములు గలిగినను లోపింపక నిలుచును. కాని, ఏక శేష సమాసమున కలిసినపదములలో నొకటి మాత్రము నిలిచి తక్కినవి లోపించిపోవును నామవాచకాదుల బహువచనము చెప్పవలసినప్పుడు సరూపములైన పదములు చేరి యందొక్క పదముమాత్రము శేషించును. రామ + రామ + రామ అను సరూపములగు మూడు పదములు సమసించి 'రామరామరామ' అను సమాసముకాక, వానిలో నొక్కరామశబ్దము మాత్రము మిగిలి 'రామ లు' అను రూప మేర్పడును. ఇట్లు సరూపములగు పదములు మాత్రమేకాక రూపభేదము గలిగియున్నను నేకార్థమున గలిగిన పదములు కూడినప్పుడును వానిలో నొక్క పదము మాత్రము శేషించుట గలదు: ఉదా. వక్రదండము + కుటిలదండము = వక్రదండములు, లేక కుటిలదండములు.

(1) ఒక వంశము నారంభించిన వానినుండి కలిగిన పేరు గోత్రము; అట్లారంభించిన వాని కొడుకు కూడ నాగోత్రము వాడు.కాని, గోత్రకర్త మనుమడు జీవించియుండినచో నతని వంశము 'యువ' మగును, 'గోత్ర' పదమునకు 'వృద్ధ' అనునది నామాంతరము. ఒక వృద్ధపదమును ఒక యువపదమును సమాసమందు చేరునప్పుడు వృద్ధపదముమాత్రము శేషించి, యువపదము లోపించును. ఈ రెండు పదముల రూపములకును వాని ప్రత్యయములందు మాత్రము భేదముండవలెను. ఉదా. గార్గ్యుడు + గార్గ్యాయనుడు = గార్గ్యులు. ఇచట 'గార్గ్య' అనునది వృద్ధపదము; గార్గ్యాయనుడు అనునది యువపదము; కావున రెండింటిలోను సమాసమున వృద్ధపదము శేషించినది. 'గార్గ్యుడు + వాత్స్యాయనుడు' అనుచోట గార్గ్య అనునది వృద్ధపదమును, వాత్స్యాయన అనునది యువపదమునైనను రెండు పదములకును సరూపత్వము లేదుగనుక యువపదము లోపింపదు; గార్గ్యవాత్స్యాయనులు అని మాత్రమే సమాసమగును. ఆ రెండు పదములును కేవల వృద్ధ, యువ, అను నర్థములను మాత్రము గలిగియుండవలెను; మఱియొకయర్థము గలిగిన యెడల నేకశేషసమాసము సిద్ధింపదు. 'భాగవిత్తి + భాగవిత్తకుడు' ఇచట భాగవిత్తకపదము నిందార్థమున్నది గనుక, యువపదముకాదు; కాబట్టి, భాగవిత్తి భాగవిత్తికులు అనియే సమాసమగును.