పుట:Andhra bhasha charitramu part 1.pdf/786

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(11) గవాశ్వము మొదలగు ద్వంద్వసమాసములును నేకవచనమందుండి సాధువు లగుచున్నవి: గవాశ్వము, గవాదికము, గవైడికము, అజావికము, అజైడకము, కుబ్జవామనము, కుబ్జకైరాతకము, పుత్రపౌత్రము, చండాలము, స్త్రీకుమారము, దాసీమాణపకము, శాటీపిచ్ఛకము, ఉష్ట్రఖరము, ఉష్ట్రశశము; సూత్రశకృత్, మూత్రపురీషము, యకృన్మేదము, మాంసశోణితము, దర్భశరము, దర్భపూతీకము, అర్జునశిరీషము, తృణోలపము, దాసీదాసము, కుటీకుటము, భగవతీభాగవతము - ఇవి గవాశ్వాదులు

(12) వృక్ష, మృగ, తృణ, ధాన్య, వ్యంజన, పశు, శకుని, అను నర్థములు దెలుపుపేళ్ల ద్వంద్వసమాసములును; అశ్వవడవ, పూర్వాపర, అనుత్తర, అను సమాసములును, వైకల్పికముగ ఏకవచనాంతములై యుండును: ప్లక్షన్యగ్రోధము(లు); రురుపృషతము(లు); కుశకాశము(లు); వ్రీహియవము(లు); దధిఘృతము(లు); గోమహిషము(లు); శుకబకము(లు); అశ్వవడవము(లు); పూర్వాపరము(లు), అధరోత్తరము(లు).

ఫలములు, సేన, పెద్దచెట్లు, అడవిమృగములు, పక్షులు, క్షుద్రజంతువులు, ధాన్యము, గడ్డి, వీనిపేళ్లు ఎక్కువ సంఖ్యనుగాని, ఎక్కువమొత్తమునుగాని తెలియజేయుచు సమసించి సమాహారార్థమును బొందు నపు డాసమాసము ఏకవచనమం దుండును. సమాసమందలి యొకొక్క పదమును బహువచనమున నున్నచో సమాసమేకవచనమున నుండును: బదరములును ఆమలకములును 'బదరామలకము'; ఒక బదరము, ఒక అమలకము 'బదరామలకములు.' ఒక రథికుడును ఒక అశ్వారోహుడును 'రథికాశ్వారోహులు.' ఒక ప్లక్షమును ఒక న్యగ్రోధమును 'ప్లక్షన్యగ్రోధములు,' ఇట్లే, రురువృషతములు, హంసచక్రవాకములు, యూకాలిక్షలు, వ్రీహియవనములు, కుశకాశములు మొదలయిన వానిలోని యొకొక్క పద మొకొక్క వస్తువునే తెలియ జేయును.

(13) పరస్పర విరుద్ధార్థములుగల పదములు చేరినసమాస మాపదములు అప్రాణివాచక ద్రవ్యపదార్థముల పేళ్లు కానపుడు వైకల్పికముగ నేకవచనమం దుండును: శీతోష్ణము(లు), సుఖదు:ఖము(లు), జీవితమరణము(లు). 'దధిపయస్‌' మొదలగు ద్వంద్వసమాసము లేకవచనమున నుండవు. దధిపయసులు, సర్పిర్మధుసులు, మధుసర్పిషులు, బ్రహ్మప్రజాపతులు, శివవైశ్రవణులు, పరివ్రాట్‌కౌశికులు, ప్రవర్గ్యోపసదులు, శుక్లకృష్ణములు, ఇథ్మాబర్హిషులు, దీక్షాతపసులు, శ్రద్ధాతపసులు, మేధాతపసులు, అధ్యయనతపసులు, ఉలూఖలముసలములు, అద్యావసానములు, శ్రద్ధామేధలు, ఋక్సామలు, వాఙ్మ్‌నసలు - ఇవి దధిపయ ఆదులు