పుట:Andhra bhasha charitramu part 1.pdf/785

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


జాతులు గుణవాచకములైనను క్రియావాచకములైనను నేకవచనము రాదు: రూపరసములు, గమనాకుంజనములు.

ద్రవ్యవాచక జాతులనుదెలుపు పదముల సమాసమైనను సమాహారమగునప్పుడే యేకవచనము కలుగును. సమాహారార్థము లేనప్పుడు గలుగదు: బదరామలకములు.

(8) వేర్వేఱు లింగములందున్న పదముల సమాహారద్వంద్వసమాసమాపదములు నదీ, దేశ, నామము లగునప్పు డేకవచనమందుండును: ఉదా. ఉద్ధ్యేరావతి ('ఉద్ధ్య' అనున దొకపదము), గంగాశోణము; కురుకురు - క్షేత్రము.

సమాసమునందలి పదములు పట్టణముల పేళ్లయినపుడు ఏకవచనము రాదు: జాంబవశాల్యూనులు (జాంబవ, శాల్యూని, అను పట్టణములు).

ఏకవచన నిషేధము గ్రామ, పట్టణవాచక పదములకెకాని, నగర వాచకపదములకు లేదు: మధురాపాటలీపుత్రము.

సమాసములోని యొకపదము పట్టణ, గ్రామవాచకమును, నొకటి నగరవాచకమును నైనయెడల ఏకవచనము నిషిద్ధమగును: సౌర్యకేతవతములు (సౌర్యనగరము, కేతవత గ్రామము).

సమాసమందలి పదములు పర్వతనామము లయినను నేకవచనము గలుగదు: కైలాసగంధమాదనములు.

రెండుపదములును నేకలింగమునం దున్నయెడల నేకవచనము గలుగదు: గంగాయమునలు (రెండును స్త్రీలింగములు), మద్రకేకయలు (మద్రదేశము, కేకయదేశము).

ఒకపదము దేశవాచకమును ఒకటి నదీవాచకమును నయినను ఏకవచనము గలుగదు: గంగాకురుక్షేత్రములు.

(9) క్షుద్రజంతువులను దెలుపు పదముల సమాహారద్వంద్వసమాస మేకవచనమున నుండును: యూకాలిక్షము (పేలు, ఈరుపేలు).

సహజవైరముగల జంతువులను దెలుపుపదముల ద్వంద్వసమాసము ఏకవచనమం దుండును: అహినకులము, గోవ్యాఘ్రము, కాకోలూకము.

(10) ఎక్కువ జాతులవారితోడి సంపర్కము నిషేధింపబడని శూద్ర జాతులను దెలుపు పదముల ద్వంద్వసమాసములు ఏకవచనమందుండును: తక్షాయస్కరము (వడ్రంగి, కమ్మరి); కాని, చండాల మృతపులు (వీరి కెక్కువ జాతులవారితో సంపర్కము లేదు).