పుట:Andhra bhasha charitramu part 1.pdf/781

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రత్యయముచేరదు: ఈ కాయము బహునాడి; ఈ గ్రీవము బహుతంత్రి - కాని, ఈస్తంభము బహునాడీకము; ఈ వీణ బహుతంత్రీక.

(45) 'నిష్ప్రవాణి అను సమాసమున నుత్తరపదముగానున్న, 'ప్రవాణీ' శబ్దము నదీసంజ్ఞకమైనను దానిపై 'క(ప్)' ప్రత్యయము రాదు: ఈ బట్ట నిష్ప్రవాణి = మగ్గమునుండి తీసినది.

(46) సప్తమీవిభక్తియందున్న పదమును, విశేషణ పదమును బహువ్రీహిసమాసమున బూర్వపదములుగా నుండవలెను: ఉదా. ఉరసి - లోముడు.

సర్వనామములును సంఖ్యావాచకములును బూర్వపదములుగ నుండును: సర్వశ్వేతుడు.

సర్వనామపదమును సంఖ్యావాచకపదమును గలిసి యేర్పడిన బహువ్రీహిసమాసమున సంఖ్యావాచకపదము పూర్వపదముగా నుండవలెను: ద్వ్యన్యుడు.

సమాసమునందలి రెండుపదములును సంఖ్యావాచకపదము లైనయెడల తక్కువసంఖ్యను దెలుపునది పూర్వపదముగ నుండవలెను: ద్విత్రములు.

ద్వంద్వసమాసమున గూడ రెండుసంఖ్యావాచకపదములు చేరునప్పుడు తక్కువసంఖ్యను దెలుపునది పూర్వపదముగా నుండవలెను: ద్వాదశము.

బహువ్రీహిసమాసమున 'ప్రియ' అను పదము పూర్వపదముగా నైనను ఉత్తరపదముగానైనను నుండవచ్చును: గుడప్రియుడు; ప్రియగుడుడు.

'గడు' (=వంకర, గూను) మొదలగు పదములపై సప్తమీవిభక్త్యర్థకపద ముత్తరపదముగ జేరును: గడుకంఠుడు, గడిశిరుడు. ఒకప్పుడిట్లుకాదు: వహీగడుడు (భుజమునందు వంకర గలవాడు).

(47)నిష్ఠావాచకపదము బహువ్రీహిసమాసమున బూర్వపదముగా నుండును: కృతకృత్యుడు, యుక్తయోగుడు, కృతకటుడు, భిక్షితభిక్షి - సారంగజగ్ధి, మాసజాతుడు, సుఖజాతుడు, ఇచట నిష్ఠాపద ముత్తరపదముగా నున్నది.

(48)'అహితాగ్ని' మున్నగు సమాసములలో నిష్ఠాపదము వైకల్పికముగా బూర్వపదము కావచ్చును: అహితాగ్ని, అగ్న్యాహితుడు.