పుట:Andhra bhasha charitramu part 1.pdf/769

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(18) ద్విగుసమాసమందును, అర్ధశబ్దమునకు బరమందున్నప్పుడును 'ఖారీ' శబ్దముపైగూడ 'టచ్‌' ప్రత్యయము వైకల్పికముగా వచ్చును: ఉదా. ద్విఖారము, ద్విఖారి; అర్ధఖారము, అర్ధఖారి.

(19) ద్విగుసమాసమున ద్వి, త్రి, శబ్దములు పూర్వపదములుగాగల 'అంజలి' శబ్దముమీద 'టచ్‌' ప్రత్యయము వైకల్పికముగా నగును: ఉదా. ద్వ్యంజలము, ద్వ్యంజలి; త్ర్యంజలము, త్ర్యంజలి.

(20) తత్పురుషసమాసమున నుత్తర పదముగానుండు బ్రహ్మన్ శబ్దముకంటె నొక దేశవాసియను నర్థము కలుగునప్పుడు 'టచ్‌' ప్రత్యయము చేరును: ఉదా. సురాష్ట్రబ్రహ్మ, అవంతిబ్రహ్మ మొదలయినవి.

(21) కు, మహత్, అను పదములు పూర్వమందుగలిగి బ్రహ్మన్ శబ్దము పరమందున్న తత్పురుషసమాసమున బ్రహ్మన్ శబ్దముకంటె టచ్ ప్రత్యయము వైకల్పికముగా చేరును: ఉదా. కుబ్రహ్మ.

(22) కర్మధారయసమాసమున బూర్వపదముగా నుండినను 'జాతీయ' అను పదము దానికి పరమందున్నను మహత్ పదము నంత్య హల్లునకు 'అ' అని యాదేశమగును: ఉదా. మహాబ్రహ్మ, మహాదేశీయుడు. కర్మధారయసమాసము కానప్పుడు 'మహత్సేవ'.

(23) ద్వి, అష్టన్ అను సంఖ్యావాచకపదములపై మఱియొక సంఖ్యావాచకపదము చేరినయెడల వాని యంత్యవర్ణములకు 'ఆ' ఆదేశమగును: ఉదా. ద్వాదశము, ద్వావింశతి, అష్టాదశము, అష్టాశీతి మొదలైనవి.

(24) 'త్రి' అను పదమునకు మఱియొక సంఖ్యావాచకపదము పరమగునపుడు 'త్రి' కి 'త్రయన్‌' అను నాదేశము కలుగును: త్రయోదశము, త్రయోవింశతి, త్రయస్త్రింశత్తు - ఈ యాదేశము బహువ్రీహిసమాసమందును, 'అశీతి' అను పదము పరమగునపుడును గలుగదు: ఉదా. త్రిదశులు; త్ర్యశీతి. మఱియు నీ యాదేశము నూఱువఱకుగల సంఖ్యలను దెలుపు పదములు పరమగునపుడే కలుగును: ఉదా. త్రిశతము, త్రిసహస్రము మొదలగునవి.

(25) 'ఏక' అను పదముతో నారంభమగు పదముననుండు 'నఞ్‌' అనునది లోపించక నిలుచును; ఈ 'ఏక' శబ్దముపై 'అదుక్‌' అను నాగమము వచ్చును: ఏకాత్ న వింశతి, ఏకాన్నవింశతి.

'షష్‌' = 6 అను పదముపై 'డతృ, డశ, --' అనునవి చేరునపుడు దాని తుది నకారమున కుత్వమాదేశమయి 'షో' అని యగును. దానిపై జేరిన పదము నాడి నకారము క్ష కారముగనో, డకారముగనో మాఱును: