పుట:Andhra bhasha charitramu part 1.pdf/766

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవికా, ఉపనిమద్, అను పదములు - కృ (=చేయు) ధాతువుతో జేరి 'పోలిక' అను నర్థమును బొందునపుడు నిత్యముగ గతిసంజ్ఞకము లగును. జీవికాకృతము, ఉపనిషత్కృతము.

ప్రాదిసమాసములు.

ప్రాదులతో గూడిన సమాసములు గతిసంజ్ఞగలవి కావు.

(1) ప్రాదులు 'పోయిన' మొదలగు నర్థములలో ప్రథమావిభక్త్యంత పదముతో సమసించును: ఉదా. ప్రాచార్యుడు, ప్రపితామహుడు, ప్రమాతామహుడు.

(2) 'అతి' మొదలగునవి 'దాటిన, మించిన' అనునర్థములలో ద్వితీయా విభక్త్యంత పదములతో సమసించును: ఉదా. అతిమాలుడు, అతిఖట్వుడు, అభిముఖము, ఉద్వేలము, ప్రత్యక్షము.

(3) 'అవ' మొదలగునవి 'అఱచిన' మొదలగు నర్థములలో తృతీయా విభక్త్యంత పదములతో సమసించును: ఉదా. అవకోకిలము = కోకిల అఱచు కాలము; పరివీరుధము, సంవర్మము మొదలయినవి.

(4) 'పరి' మొదలగునవి 'అలసిన' మొదలగు నర్థములలో చతుర్థ్యంత పదములతో సమసించును: ఉదా. పర్యధ్యయనుడు = అధ్యయనము, కొఱకు నలసినవాడు; అలంకుమారి = కుమారి జీవనమునకు చాలినంతధనము.

(5) 'నిర్‌' మొదలగునవి 'దాటిన, మించిన', మొదలగు నర్థములలో పంచమీవిభక్త్యంతపదములతో సమసించును: ఉదా. నిష్కౌశాంబి = కౌశాంబీనగరమును వదలినవాడు; నిర్వారణాసి = వారణాసి నగరమును విడిచినవాడు; ఉత్కులుడు = కులమును విడిచిపెట్టినవాడు; నిరంగులమ్ = వ్రేళ్లను విడిచినది.

ఉపపదసమాసములు.

పాణిని సూత్రములలో సప్తమీవిభక్త్యంతముగ నిరూపింపబడిన పదముచే దెలుపబడు పదమునకు ఉపపదమను సంజ్ఞగలదు. ఉదాహరణమునకు 'కర్మణ్యన్‌' అనునది పాణినిసూత్రము. ఇందు 'కర్మణి' అనుపదము సప్తమ్యంతముగా నున్నది. కావున, కర్మమును దెలుపు ద్వితీయావిభక్త్యంతపదమున కుపపదమను సంజ్ఞ కలుగును. ఇట్లే తక్కినచోట్లను దెలియవలెను.

(1) సుబంతమయిన ఉపపదము సమర్థమగుపదముతో సమసించును. అట్టి సమాసము తిజంతముగా నుండగూడదు: ఉఅదా. కుంభమును చేయువాడు 'కుంభకారుడు'.